● కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన జొన్నలు ● పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
కంగ్టి(నారాయణఖేడ్)/కల్హేర్(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని జమ్గి(బీ), జమ్గి(కే), గాంధీనగర్, బాన్సువాడ, దామర్‌గిద్దా, ముర్కుంజాల్, తడ్కల్, ఘన్‌పూర్, చాప్టా పరిసర గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు జమ్గి(బీ) కొనుగోలు కేంద్రంలో జొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి జమ్గి(బీ) కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన జొన్నలను పరిశీలించారు. ప్రభుత్వ ఆలసత్వంతో తడిసిన జొన్నలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో గురువారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. కల్హేర్, మాసాన్‌పల్లి, తదితర చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంతర్‌గాంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వరి కుప్పలు తడిసిపోయాయి. అయితే ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న జనం వర్షం కారణంగా ఉపశమనం పొందారు.


