ధాన్యం కొనుగోళ్లు చేయాలని
నవాబుపేట రైతుల ఆందోళన
హత్నూర(సంగారెడ్డి): ధాన్యం తీసుకొచ్చిన నెలలు గడుస్తున్నా తూకం వేయడం లేదని, అన్‌లోడింగ్‌కు లారీలు పంపించడం లేదని నవాబుపేట రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రమైన హత్నూర తహసీల్దార్ కార్యాలయం వద్ద జోగిపేట ప్రధాన రహదారిపై గురువారం నవాబుపేట గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. డబ్బులిచ్చిన వారికే ధాన్యం తూకం వేస్తున్నారంటూ రైతులు ఆరోపించారు. అధికారులకు చెప్పినా లారీలు పంపిస్తామంటున్నారే తప్ప లారీలు పంపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం ఇప్పటికే మొలకొచ్చి తడిసిపోయిందని నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు వాపోయారు. రాస్తారోకో సమాచారం అందుకున్న వెంటనే లారీలు పంపిస్తామని ఉన్నతాధికారులు ఫోన్ ద్వారా చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.


