● బంగారం, వెండి ఆభరణాలు స్వాఽధీనం
● వివరాలు వెల్లడించిన మెదక్ డీఎస్పీ
పెద్దశంకరంపేట(మెదక్): అంతర్‌జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 14న మండలంలోని చీలాపల్లిలో కిలో పైగా బంగారం, రెండున్నర కిలోల వెండిని దొంగలు చోరీ చేశారు. ఈ కేసులో ఇటీవల నిందితుల నుంచి 94 తులాల బంగారం, కిలోన్నర వరకు వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మిగతా బంగారం, నిందితుల కోసం పోలీసులు మూడు బృందాల ద్వారా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు జైరాంయాదవ్‌ను విచారించారు. బుధవారం ఉదయం అతడి బంధువులైన మరో ప్రధాన నిందితుడు రాథోడ్ ఇప్పూసింగ్, బానోత్ సురేఖ, బానోత్ మీరిబాయిలను చందర్‌నాయక్‌తాండా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14.2 తులాల బంగారు, 87 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు చోట్ల 23 కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో రాథోడ్ సుగుణాబాయి, బానోత్ సుభాష్ పరారీలో ఉన్నారని, త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కేసును ఛేదించిన అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్‌ఐలు ప్రవీణ్‌రెడ్డి, శంకర్, పోచయ్యలతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.


