హుస్నాబాద్: రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుస్నాబాద్ వడివడిగా అభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. శాతవాహన యూనివర్సిటీ అనుబంధంగా హుస్నాబాద్‌లో గత ఏడాది ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 5 కోర్సులతో 300 సీట్లను అందుబాటులోకి తెచ్చారు. కళాశాలకు శాశ్వత బిల్డింగ్ కోసం ప్రభుత్వం 36 ఎకరాల భూమిని కేటాయించింది. బిల్డింగ్ నిర్మాణానికి రూ.44.12 కోట్లు మంజూరు చేసింది. ఈ భవనం పూర్తయ్యేలోపు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాలిటెక్నిక్ కళాశాల క్యాంపస్‌లో తాత్కాలికంగా అడ్మిషన్లు, తరగతులు ప్రారంభించారు. ఈ ప్రాంత ప్రజల మెరుగైన వైద్యం కోసం ఇతర పట్టణాలకు వెళ్లకుండా 250 పడకల ఆస్పత్రిని మంజూరు చేసింది. రూ.88 కోట్ల వ్యయంతో ఆస్పత్రి భవన నిర్మాణం కొనసాగుతుంది. అలాగే కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు వరసల రహదారి నిర్మాణానికి రూ.163.20 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులను రెండు ఫేజ్‌లుగా విభజించారు. 2వ ఫేజ్ పనులు ప్రారంభమయ్యాయి. హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 10 కిలోమీటర్ల మేర నాలుగులేన్లతో హ్యామ్ విధానంలో రోడ్డు నిర్మాణానికి రూ.58.91 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే ప్రకృతి సోయగాలకు ప్రతీకగా నిలిచిన ఉమ్మాపూర్ కోటగిరి గుట్టలపై అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రూ.10 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.


