సంగారెడ్డి క్రైమ్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా, ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్న భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలు ప్రజల ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రద్దీ కాలనీల్లో మున్సిపల్ అధికారుల అనుమతి లేకుండానే సుమారు 30 నుంచి 50 వరకు భారీ హోర్డింగులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈదురుగాలులకు ఇవి ప్రయాణికులు, వాహనదారుల మీద పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు కేవలం ఆదాయంపైనే కాకుండా, ప్రజల భద్రతపై దృష్టి సారించి తక్షణమే ముందస్తు చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..
జిల్లా కేంద్రంలో భారీ హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటుకు మున్సిపాలిటీ నుంచి ముందస్తు అనుమతులు పొందడం తప్పనిసరి. ఇందుకోసం మున్సిపల్ కార్యాలయంలో లేదా మీసేవా కేంద్రాల ద్వారా నిర్ణీత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, కొంతమంది నిర్వాహకులు నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేస్తూ తమ ఇష్టానుసారంగా భారీ హోర్డింగులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వేగంగా వీస్తున్న గాలులకు ఈ ఫ్లెక్సీలు చినిగిపోయి రోడ్లపై వెళ్లే వాహనదారుల మీద పడుతుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో ఫ్లెక్సీలను కేవలం కర్రల సాయంతో బలహీనంగా ఏర్పాటు చేయడంతో, అవి ఎప్పుడు ఊడి నెత్తిన పడతాయోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల హోర్డింగులకు ఉన్న ఇనుప రేకులు సైతం ఊడిపోయి ప్రధాన రహదారులు, వాహనాలపై పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
భద్రత ఏది?
మున్సిపల్ అధికారులు హోర్డింగుల ద్వారా వచ్చే ఆదాయంపై చూపుతున్న శ్రద్ధ, వాటితో ప్రజలకు ఎదురవుతున్న ముప్పును నివారించడంలో చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోకముందే పట్టణ అధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా భారీ హోర్డింగులు
అనుమతులు లేకుండానే వెలుస్తున్న ఫ్లెక్సీలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు


