పటాన్‌చెరు: నియోజకవర్గ పరిధిలోని ప్రతి స్వయం సహాయక సంఘానికి రుణాలు మంజూరు చేయడంతో పాటు వారి అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఆర్డీఏ, మెప్మా, రెవెన్యూ, ఎకై ్సజ్, హెచ్‌ఎండీఏ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. అలాగే కొల్లూరులో పెట్రోల్ బంక్, కొత్తపల్లిలో రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలోనే భూములు కేటాయిస్తామని తెలిపారు. గుమ్మడిదలలో మహిళా సమాఖ్య భవనానికి సీఎస్‌ఆర్ నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు. సమాజాన్ని పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని కట్టడి చేసేందుకు పోలీసు, ఎకై ్సజ్ శాఖలు సమన్వయంతో నిఘా పెట్టి, అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. నిధులు మంజూరైనా నత్తనడకన సాగుతున్న సాకి చెరువు, తిమ్మక్క చెరువు, దోషం చెరువుల సుందరీకరణ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పశువదశాల, కుల సంఘాలు, సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు వెంటనే స్థలాలు కేటాయించాలని రెవెన్యూ శాఖకు సూచించారు. వడకపల్లి కోట అభివృద్ధి కోసం రూ.10 కోట్ల నిధులు వెనక్కి వెళ్లకుండా ఎన్‌ఓసి జారీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. లాలాబావి, చక్రపురి కాలనీలలో హైడ్రా పేరుతో సిసి రోడ్ల పనులను ఆపడం సరికాదని, సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ జ్యోతి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యారావు, తహసీల్దార్లు వెంకటేష్, హరిబాబు, హెచ్‌ఎండీఏ డీఈ రామారావు, ఎక్సైజ్ సీఐ పరమేశం, తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ల అభివృద్ధికి నిధులు కేటాయించండి
పటాన్‌చెరు టౌన్: అమీన్‌పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలోని తొమ్మిది డివిజన్ల సమగ్ర అభివృద్ధికి నిధులు కేటాయించాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం గచ్చిబౌలిలోని సీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌తో ఎమ్మెల్యే సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. డివిజన్‌ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయడంతో పాటు తెల్లాపూర్, అమీన్‌పూర్, బొల్లారం మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనమయ్యే సమయంలో రూ. 250 కోట్ల మిగులు నిధులను సైతం డివిజన్‌ల అభివృద్ధికి మంజూరు చేయాలని కోరారు. ప్రధానంగా మినీ స్టేడియాలు, చెరువులు, శ్మశాన వాటికలు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. రెండు సర్కిళ్ల పరిధిలో శరవేగంగా నూతన కాలనీలు ఏర్పాటు అవుతున్నాయని, ఇందుకు అనుగుణంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విధి దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా.. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్‌తో ఎమ్మెల్యే సమావేశమై పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అమీన్‌పూర్ డివిజన్ పరిధిలో వరద నీటి సమస్య పరిష్కారానికి ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించామని, కాల్వల నిర్మాణానికి రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు జోనల్ కమిషనర్ అమిత్.. ఎమ్మెల్యేకు తెలిపారు. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని రేడియం రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పాటు ఉర్జిత్ విల్లాస్ సమీపంలో వరద నీటి సమస్య పరిష్కారానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అంతేకాదు, మినీ స్టేడియాల అభివృద్ధికి వెంటనే నిధులు కేటాయించాలని కోరారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


