జిన్నారం (పటాన్‌చెరు): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని గుమ్మడిదల మండలంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం, లారీల కొరత కారణంగా రైతన్నలు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అసహనం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాగుతున్న తీరుపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు సకాలంలో తరలించి రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి, నాణ్యత దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికై నా ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం తగు విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, రైతులు పాల్గొన్నారు.


