వేములవాడరూరల్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసేలా చూడాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, నమిలిగొండపల్లి గ్రామాల్లో మంగళవారం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోళ్ల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ల వివరాలపై ఆరా తీశారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు వాహనాలను సమకూర్చాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించి లాభదాయకమైన పంటలను సాగు చేయాలని తెలిపారు.
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలే లక్ష్యం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓఎంసీహెచ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నాగేంద్ర బాబు, వైద్యాధికారి డాక్టర్ స్నేహ మాట్లాడుతూ, గర్భిణులకు అందుతున్న సేవలపై అవగాహన కల్పించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం, అధిక ప్రమాదం ఉన్నవారిని ముందుగానే గుర్తించి తల్లి, శిశు మరణాలను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి గర్భిణి కనీసం ఒక్కసారైనా నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు అయ్యేలా చూసుకోవాలని కోరారు. అలాగే గర్భధారణ సమయంలో నాణ్యమైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల 9న ఈ కార్యక్రమాన్ని పీహెచ్‌సీతో పాటు అన్ని సబ్ సెంటర్లలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. హెల్త్ సూపర్‌వైజర్లు అరవింద్, ప్రమీల, సతీశ్‌కుమార్, ప్రమీల, సుల్తానమ్మ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ గురుకులం సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈటీఎల్‌ఏ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏనుగుల సంతోష్ కోరారు. మంగళవారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఓఎస్‌డీ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న పదోన్నతులు, డిగ్రీ కళాశాల టైం టేబుల్ మార్పు, పీజీటీ ఫిజికల్ సైన్స్, బయోసైన్స్, హిందీ పోస్టులు మంజూరు చేయాలన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, వ్యాయామ ఉపాధ్యాయులకు క్రాస్ ప్రమోషన్స్ చేపట్టాలని, మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఏ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆవుల సైదులు, కంది సంపత్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌వో రజిత బదిలీ
సిరిసిల్లటౌన్: జిల్లా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ రజిత బదిలీ అయ్యారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ రాష్ట్రంలోని డెప్యూటీ డీఎంహెచ్‌వోలను బదిలీలను చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు జిల్లాలో డెప్యూటీ డీఎంహెచ్‌వో(ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో)గా పనిచేస్తున్న రజితను హనుమకొండ జిల్లాకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో వికారాబాద్ జిల్లా డెప్యూటీ డీఎంహెచ్‌వోగా పనిచేస్తున్న డాక్టర్ పవిత్రను నియమించారు. రెండు రోజుల్లో ఆమె సిరిసిల్లలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.


