వస్త్రోత్పత్తి స్వరూపం ఇలా..
వస్త్రోత్పత్తిదారులకు బకాయిల గుదిబండ
3.06 కోట్ల మీటర్ల ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు
బట్ట తయారీకి అందని నూలు
జూలైలోగా ఉత్పత్తి చేయాలని గడువు
పెరిగిన నూలు ధరలు
ఆ మేరకు పెరగని బట్ట ధర
సందిగ్ధంలో వస్త్రోత్పత్తిదారులు
అందిన ఆర్డర్లు..
సిరిసిల్ల: రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు చిలుకపచ్చ రంగు, ఎర్రని డిజైన్ బార్డర్‌తో ఇందిరా మహిళాశక్తి చీరలను కానుకగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రంలోని పవర్‌లూమ్స్(మరమగ్గాల)పై చీరల బట్టను ఉత్పత్తి చేసేందుకు ఆర్డర్లు ఇచ్చింది. చీరల డిజైన్లను రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్‌లో వస్త్రోత్పత్తిదారుల సమక్షంలో మే 6న చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రదర్శించారు. సిరిసిల్లలో 10,056 పవర్‌లూమ్స్‌కు(130 మ్యాక్స్ సంఘాలకు) ఉత్పత్తి ఆర్డర్లను చేనేత, జౌళిశాఖ అధికారులు ఇచ్చారు. జూలై 31లోగా చీరల బట్ట ఉత్పత్తి చేసి ఇవ్వాలని గడువు విధించారు. కానీ నూలు డిపో ద్వారా ఇప్పటికీ నూలు(ధారం)ను సరఫరా చేయలేదు. కొందరు వస్త్రోత్పత్తిదారులు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తే మార్కెట్‌లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. కానీ ఆ మేరకు ప్రభుత్వం మీటరు బట్టకు చెల్లించే ధరను పెంచకుండా.. పాత ధర మీటరుకు రూ.34 చెల్లిస్తామని చెప్పడంతో చీరల ఉత్పత్తి సాగడం లేదు.
స్కూల్ యూనిఫామ్స్ బట్ట కొనుగోలులో జాప్యం
స్కూల్ విద్యార్థులకు యూనిఫామ్స్ దుస్తుల కోసం సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు 60 లక్షల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. 20 లక్షల మీటర్ల బట్ట మే 31 నాటికి సిద్ధమైనా ఆ బట్టను అధికారులు కొనుగోలు చేయడం లేదు. జూన్ రెండో వారంలో పాఠశాలలు తెరిచే నాటిని పిల్లలకు యూనిఫామ్స్ అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. ఆర్‌వీఎం(రాజీవ్ విద్యా మిషన్), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్ వస్త్రాల సేకరణ సాగడం లేదు. సిరిసిల్లలోని 25 వేల మరమగ్గాలు(పవర్‌లూమ్స్)పై షూటింగ్, షర్టింగ్, ఓనీ వస్త్రాలు ఉత్పత్తి చేయాల్సి ఉండగా నూలు(దారం) అందించడంలో జాప్యమవుతుంది.
చీరల బట్టకు సంబంధించిన వెప్ట్ నూలు(అడ్డం పోగులు) వచ్చింది. వార్పు(నిలువు పోగులు) ఇంకా రావాలి. జరీ నూలు కూడా రావాలి. నూలు రాగానే డీడీలు చెల్లించిన మ్యాక్స్‌లకు సరఫరా అవుతుంది. ఇప్పటికే డీడీలు చెల్లించిన 16 మ్యాక్స్ సంఘాలకు వెప్ట్ నూలును సరఫరా చేశారు. ఇందిరా మహిళా శక్తి చీరల బట్టకు ధరల నిర్ణయం, వస్త్రోత్పత్తిదారులకు రావాల్సిన బకాయిల విడుదల అంశం మా పరిధిలో లేదు. – ఎస్.సంతోష్‌కుమార్, చేనేత,
జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల
సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వం నుంచి రూ.200 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో వెల్ఫేర్ డిపార్టుమెంట్, ఆర్‌వీఎం, బతుకమ్మ చీరలు, పోచంపల్లిలో నిల్వ చేసి వినియోగించిన వస్త్రాలకు సంబంధించి రూ.200కోట్ల మేరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పోచంపల్లిలో నిల్వ చేసిన బట్టకు సంబంధించి వంద శాతం పేమెంట్లు రావాలి. కొన్ని వస్త్రాలకు 10 శాతం, కొన్నింటికి 30 శాతం, మరికొన్నింటికి 40 శాతం పేమెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు రూ.200 కోట్లు పెండింగ్‌లో ఉండడంతో మళ్లీ బట్ట ఉత్పత్తికి పెట్టుబడి లేక దిక్కులు చూస్తున్నారు.


