● ఏడు చేనేత, నాలుగు పవర్‌లూమ్ సహకార సంఘాలు ● సంఘాల్లో 321 మంది సభ్యులు ● ఓటర్ల జాబితా సిద్ధం ● ఎన్నికల నోటిఫికేషన్‌పై సందిగ్ధం
సిరిసిల్ల: రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఏడు చేనేత, నాలుగు పవర్‌లూమ్ సహకార సంఘాలు ఉన్నాయి. 2013లో ఫిబ్రవరిలో చివరిగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా.. 2018లో ఆ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. 2018 నుంచి ఆరు నెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడగిస్తూ వచ్చింది. జిల్లాలోని 11 సహకార సంఘాల ఫొటో గుర్తింపుకార్డులతో కూడిన ఓటర్ల జాబితాను చేనేత, జౌళిశాఖ అధికారులు సిద్ధం చేసి రాష్ట్ర సహకార శాఖ అధికారులకు పంపించారు. తొలి విడతగా 50 మంది కంటే తక్కువ సభ్యులు ఉన్న సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సహకార సంఘాల్లోనూ 50 మందిలోపే సభ్యులు ఉండడంతో తొలి విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 12న ఎన్నికలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ జారీ అయినట్లు సమాచారం ఉన్నా సందిగ్ధత నెలకొంది.
1964 సహకార చట్టంలో రిజిస్ట్రేషన్ అయిన సంఘాలకే..
సహకార చట్టం 1964 ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన చేనేత సహకార సంఘాలను ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో 7 సంఘాలు ఆ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కాగా.. నాలుగు పవర్‌లూమ్ సంఘాలు 1964 సహకారచట్టం పరిధిలో ఉన్నాయి. దీంతో జిల్లాలో 11 సంఘాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. చేనేత సహకార సంఘాల్లో 234 మంది సభ్యులు, పవర్‌లూమ్ సహకార సంఘాల్లో 87 మంది సభ్యులు ఉన్నారు. ఒకప్పుడు ఈ సంఘాల్లో వందలాది మంది సభ్యులు ఉండడంతో ఒక్క వెలుగు వెలిగిన ఆ చేనేత సహకార సంఘాలు ఇప్పుడు పెద్దగా సభ్యులు లేక ఉన్నాయి. చేనేత వృత్తిని ఎవరూ చేయకపోవడంతో అంతా పవర్‌లూమ్‌కు మారడంతో చేనేత సంఘాలు, మగ్గాలు మూలనపడ్డాయి. ప్రస్తుతం ఉన్న సంఘాల్లోని సభ్యులు సైతం వృద్ధాప్యంలో ఉన్నారు.


