రాజకీయ అవగాహన కోసమే శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

రాజకీయ అవగాహన కోసమే శిబిరాలు

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

రాజకీయ అవగాహన కోసమే శిబిరాలు ● సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి ● సిరిసిల్ల టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ ● జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత ● అడిషనల్‌ డీఆర్డీవో శ్రీనివాస్‌

● సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి

వేములవాడఅర్బన్‌: సీపీఐ శిక్షణ శిబిరాలు రాజకీయ అవగాహన, సామాజిక న్యాయం కోసం నిర్వహిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర నాయకుడు చాడ వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. వేములవాడలోని మహాలింగేశ్వర ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం సీపీఐ శిబిరాలను ప్రారంభించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కొరవడిందన్నారు. ధరల పెరుగుదలకు హద్దులు లేవన్నారు. దేశ సంపద పది మంది కుబేరుల చేతుల్లోనే ఉందన్నారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జాగిరే తెలంగాణ రాష్ట్రమని పవన్‌ కళ్యాన్‌ తెలుసుకోవాలని స్పష్టం చేశారు. ఆవేశానికి కేరాఫ్‌గా నిలిచిన పవన్‌ కళ్యాన్‌ ప్రొఫెసర్‌ నాగేశ్వరావు లాంటి మేధావులపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు సుదర్శన్‌, శ్రీనివాస్‌, సదానందం, విశ్వనాథం, శ్రీనివాస్‌, శంకర్‌ తదితరులు ఉన్నారు.

నంబర్‌ ప్లేట్లు సరిగ్గా ఉంచుకోవాలి

సిరిసిల్ల: వాహనదారులు నంబర్‌ ప్లేట్లు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సిరిసిల్ల టౌన్‌ సీఐ శ్రీనివాస్‌ సూచించారు. ఇటీవల చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ తనిఖీలలో 20 వాహనాలు నంబరు ప్లేట్లు సరిగ్గా లేకుండా పట్టుబడ్డాయి. ఆ వాహనాలకు శుక్రవారం నంబరు ప్లేట్లు వేయించి వాహనదారులతో మాట్లాడారు. నంబర్‌ ప్లేట్‌ తొలగించినా, నంబర్లు స్పష్టంగా కనిపించకుండా మార్ఫింగ్‌ చేసినా చట్టవిరుద్ధమన్నారు. నంబర్‌ ప్లేట్‌ స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ ఆర్‌ఎస్సై శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వర్షాకాల వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

సిరిసిల్ల: వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్‌.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శుక్రవారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. రజిత మాట్లాడుతూ వర్షాకాల ముందు జాగ్రత్తల చర్యల్లో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రతీ మంగళ, శుక్రవారాలలో డ్రైడే పాటించాలని ఆదేశించారు. ఇంట్లోకి దోమలు రాకుండా జాలీలు, మెష్‌డోర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డ్రెయినేజీల్లో ఆంటీ లార్వా మందులను పంచాయతీ సిబ్బందితో స్ప్రే చేయించాలన్నారు. ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటీ సర్వే ద్వారా గుర్తించిన జ్వరబాధితులను పీహెచ్‌సీలకు తరలించి, చికిత్స అందేలా చూడాలన్నారు. మాతా శిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ నాగేంద్రబాబు, వ్యాధి నిరోధక టీకాల ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డీడీఎం కార్తీక్‌ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి

ఇల్లంతకుంట(మానకొండూర్‌): ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని అడిషనల్‌ డీఆర్డీవో శ్రీనివాస్‌ ఆదేశించారు. మండలంలోని కందికట్కూర్‌, వంతడుపుల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. వేగంగా లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేయాలని సూచించారు. ఐకేపీ ఏపీఎం కుమారస్వామి, సీసీలు వెంకటేశం, రామచంద్రారెడ్డి, రామచంద్రం, విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement