ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. మొక్కలు నాటిన అనంతరం గ్రామంలోని మహిళలు, విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు సహకరించాలని కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో స్టీల్‌బ్యాంకులు ఏర్పాటు చేయాలని.. ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. హరిదాస్‌నగర్‌లో స్టీల్‌బ్యాంకు ఏర్పాటుకు ముందుకొచ్చిన సర్పంచ్‌ను కలెక్టర్ అభినందించారు.
కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పేపర్ ప్లేటు, గ్లాసుల వినియోగంపై ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించారు. అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో పచ్చదనం, సందర్శకుల సౌకర్యార్థం కల్పించిన మౌలిక సదుపాయాలు, అటవీ సంపదపై ప్రచారం కల్పించాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా రీల్స్ పోటీలు నిర్వహించి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. అత్యుత్తమంగా రీల్స్ రూపొందించిన వారికి నగదు ప్రోత్సాహకాలను అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సాబేరా బేగం, డీఎస్పీ నాగేంద్రచారి, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్‌బేగం, హార్టికల్చర్ అధికారి శరత్, డీవైఎస్‌వో రాందాస్, ఏడీ మైన్స్ క్రాంతి, ఎఫ్‌ఆర్వో నాగేశ్వర్‌రావు, హరిదాస్‌నగర్, పదిర సర్పంచులు నాగరాజు, మణెమ్మ, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో సత్తయ్య పాల్గొన్నారు.
విద్యార్థుల నమోదు పెంపునకు కృషి చేయాలి
సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో కల్పిస్తున్న వసతులు, సదుపాయాలపై ప్రచారం చేయాలన్నారు. కలెక్టరేట్ శుక్రవారం విద్యాశాఖ, వివిధ సంక్షేమ శాఖ అధికారులు, కో–ఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్‌తో సమీక్షించారు. జనగణన–2027లో భాగంగా తొలి దశ ప్రక్రియను నిర్ధేశిత గడువులోగా విజయవంతంగా పూర్తి చేయడంలో జిల్లా ముందంజలో నిలిపిన ఉపాధ్యాయులను అభినందించారు. జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమాధికారి రవీందర్‌రెడ్డి, మైనారిటీ అధికారి ఆయేషా తలత్ పాల్గొన్నారు.
– కలెక్టర్ గరీమా అగ్రవాల్


