చలాన్ విధిస్తాం
● ఇష్టారాజ్యంగా చెరువు మట్టి తరలింపు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరఫరా
‘వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన రైతు మ్యాకల కరుణాకర్ తన ఇంటి కోసం మట్టి తరలిస్తుంటే అనుమతులు లేవంటూ రూ.60వేలు జరిమానా విధించారు అధికారులు. సొంత పొలం నుంచి మట్టిని తరలిస్తే జరిమానా విధించిన అధికారులే.. చెరువు నుంచి అనుమతికి మించి టిప్పర్లలో మట్టిని తరలిస్తుంటే పట్టించుకోవడం లేదు. దీనిపై ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.’
వేములవాడరూరల్: చెరువు నుంచి మట్టిని తరలించేందుకు వెయ్యి క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకున్నా కాంట్రాక్టర్ ఇష్టారీతిగా తవ్వుతున్నా పట్టించుకోవడం లేదు. టిప్పర్లు, జేసీబీలు పెట్టి ఇతర ప్రాంతాలకు ట్రిప్పులకొద్దీ తీసుకెళ్తున్నా ‘మామూలు’గా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి ఊర చెరువు నుంచి మట్టి తరలించేందుకు కొందరు కాంట్రాక్టర్లు వెయ్యి క్యూబిక్ మీటర్లు తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్నారు. అనుమతికి మించి భారీ స్థాయిలో మట్టిని తరలించారని గ్రామస్తులు, రైతులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అయినా వారి ఆగడాలు ఆగకపోవడంతో రైతులు అందరూ ఏకమై శుక్రవారం తవ్వకాలను అడ్డుకున్నారు. వేములవాడ మండలంతోపాటు బోయినపల్లి మండలంలోని కొంతమంది బడా కాంట్రాక్టర్లు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టారు. ఇక్కడి మట్టిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కన్నెత్తి చూడని అధికారులు
అనుమతులు ఇస్తున్న ఇరిగేషన్ శాఖ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మట్టిని తరలించకుండా ఇష్టారాజ్యంగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కొంత మంది ప్రజాప్రతినిధు ల అండతోనే కాంట్రాక్టర్లు ఇష్టారీతిగా తవ్వకాలు చేపడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
మొదట వెయ్యి క్యూబిక్ మీటర్లకు చలాన్ చెల్లించారు. అదనంగా మరో రెండు వేల క్యూబిక్ మీటర్లకు చలాన్ కట్టారు. మరో 2 వేల క్యూబిక్ మీటర్లకు మట్టి తీశారని మా దృష్టికొచ్చింది. ఆ మేరకు చలాన్ కట్టించుకుంటాం.
– అరవింద్, ఇరిగేషన్ ఏఈ


