సిరిసిల్ల స్వచ్ఛ కీర్తిని కాపాడాలి
సిరిసిల్లటౌన్: స్వచ్ఛ పట్టణ సిరిసిల్ల కీర్తిని కాపాడుకోవడానికి పౌరులు సహకరించాలని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ కోరారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం 3,16,27వ వార్డుల్లో నిర్వహించిన వార్డు సభలో మాట్లాడారు. ముందుగా ఇటీవల 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతిచెందగా, సంతాపాన్ని తెలియజేస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈసందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలకు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో పట్టణాన్ని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ ఫాషా, డీఈ వాణి, ఏఈ నరసింహస్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


