● పాలకులకు భారంగా చెత్త సేకరణ ● ఆదాయ వనరులు కరువు ● ప్రభుత్వం నుంచి రాని నిధులు ● పెరిగిన డీజిల్ ధరలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పల్లెల్లో పాలకవర్గాలను కదిలిస్తే కష్టాల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఆదాయ వనరులు లేక.. ప్రభుత్వం నుంచి నిధులు రాక నిర్వహణ భారంగా మారింది. పల్లె పాలనపగ్గాలు చేపట్టామన్న సంతోషం కూడా వారిలో కనిపించడం లేదు. చెత్త సేకరణ నుంచి మల్టీపర్పస్ కార్మికుల వేతనాల వరకు ఎలా చెల్లించేది అని ప్రతీ నెల మదనపడుతున్నారు. చిన్న పల్లెలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఏటా రూ.40వేలు చెల్లిస్తున్నా అవి ఎటూ సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో పల్లెపాలనతో సర్పంచులు ఆర్థికబాధలు అన్నీ..ఇన్నీ కావు.
చిన్న పల్లెలకు చిక్కులే..
జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 13 మండల కేంద్రాలతోపాటు మరో 20 వరకు మేజర్ గ్రామపంచాయతీలు ఉంటాయి. మిగతావి చిన్న పల్లెలు, తండా గ్రామపంచాయతీలు ఉన్నాయి. చిన్నపల్లెల నిర్వహణకు ప్రతీ నెల రూ.50వేల వరకు ఖర్చు అవుతున్నాయి. కేంద్రం నిధులు రూ.40వేలు ఇస్తుండడంతో అవి ఎటూ సరిపోవడం లేదు. వీటితోపాటు వీధిదీపాల నిర్వహణ, చెత్తసేకరణ, మల్టీపర్పస్ వర్కర్ల వేతనాలు, ఇతరత్ర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి.
ఈ ఫొటోలో చెత్త ట్రాక్టర్ నడుపుతున్నది బుగ్గరాజేశ్వరతండా సర్పంచ్ అజ్మీర తిరుపతినాయక్. గ్రామపంచాయతీలో ఇంటింటికీ వెళ్లి చెత్తసేకరించేందుకు గతంలో ట్రాక్టర్ కొనుగోలు చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ వ్యక్తిగత కారణాలతో విధులకు హాజరుకాలేదు. తానే డ్రైవర్‌గా అవతారం ఎత్తి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాడు. చిన్న పల్లెటూరు కావడంతో ఆదాయం అంతంతే వస్తుందని.. మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు, చెత్తట్రాక్టర్ నిర్వహణ, డీజిల్ ఖర్చు తడిసి మోపెడవుతుందని తెలిపారు. ప్రతి నెలా రూ.70 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం నిధులు రాలేవని తెలిపారు. తండా పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పెంచాలని కోరారు.
పంచాయతీలకు 2025–26 ఆర్థిక సంవత్సరం నిధులు మంజూరు కాలేదు. త్వరలోనే నిధులు వస్తాయి. నిధులు రాగానే పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తాం. – సత్తయ్య,
ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట
గ్రామ సర్పంచులుగా గెలుపొంది ఆరు నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు నిధులు రాలేదు. ఇన్నాళ్లు గ్రామ నిర్వహణ ఖర్చు మా సొంత డబ్బులు వెచ్చించాం. గ్రామంలో కూడా ఆదాయం అంతంతే ఉంది. ప్రతీ నెల రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎటూ సరిపోవడం లేదు. నిధులు మంజూరు చేయాలి. అంతేకాకుండా మల్టీపర్పస్ వర్కర్ల కొరత ఉంది. – బోనాల మణెమ్మ, పదిర సర్పంచ్


