● ఎస్పీ మహేశ్ బి గితే
తంగళ్లపల్లి: ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎస్పీ మహేశ్ బి గితే అన్నారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం మండలంలోని తాడూర్ గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. గ్రామాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను రోడ్డు సేఫ్టీ కమిటీలు గుర్తించి సంబంధిత అధికారుల సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, పనిచేసే ప్రదేశాల్లో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్ నం. 87126 56425లో సంప్రదించాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు పోలీస్‌శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, రూరల్ సీఐ నాగేశ్వరరావు, ఎస్సై ఉపేంద్రచారి, ఇన్‌చార్జి ఎంపీడీవో రమేశ్, ఏవో సంజీవ్, ఎంపీవో మీర్జాఅఫ్జల్‌అహ్మద్‌బేగ్, ఎంఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.
వార్డులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు
వేములవాడ: పట్టణ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మున్సిపల్‌లోని 14,15,25వ వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో పట్టణంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. వార్డులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ఆవరణలో ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ లోకేశ్, మేనేజర్ సంపత్‌రెడ్డి, ఎస్సై రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు
సిరిసిల్ల: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేశ్ బి గితే గురువారం తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వరకు జిల్లావ్యాప్తంగా ప్రత్యేక డ్రంకెన్ డ్రైవ తనిఖీలు చేపట్టామని, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 55 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. నంబరు ప్లేట్లు కనిపించకుండా మార్ఫింగ్ చేసిన 24 వాహనాలను గుర్తించామని వివరించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిత్యం విస్తృతంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరోధిలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నంబర్ ప్లేట్ ఏర్పడకుండా ఏదైనా అడ్డుపెట్టిన, సగం నంబర్లు తొలగించి వాహనం నడిపితే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ తప్పనిసరి
సిరిసిల్ల: నిబంధనల మేరకు కండిషన్ లేని బస్సులు రోడ్డు ఎక్కడానికి వీలు లేదని, స్కూల్ బస్సులకు విధిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలని జిల్లా రవాణా శాఖ అధికారి డి.శ్రీనివాస్ కోరారు. జిల్లాలోని వివిధ ప్రైవేటు స్కూళ్లకు చెందిన బస్సులను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 160 స్కూల్ బస్సులు ఉన్నాయని, యజమానులు తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. ఎవరైనా ఫిట్‌నెస్ లేకుండా అక్రమంగా రోడ్డుపై నడిపితే నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంవీఐ వంశీధర్, ఏఎంవీఐ పృథ్వీధర్‌వర్మ, సిబ్బంది ఉన్నారు.


