ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధి

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

కోనరావుపేట(వేములవాడ): ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించవచ్చని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండలంలోని మరిమడ్లలో నిర్వహించిన గ్రామసభకు హాజరై మాట్లాడారు. వర్షాకాల సన్నద్ధతపై అధికారులు సూచించిన విషయాలను ప్రజలు పాటించాలన్నారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్‌, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దని కోరారు. గ్రామాల్లో నీటి సరఫరా సక్రమంగా లేకుంటే అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఆయిల్‌పాం, కూరగాయలు తదితర లాభదాయక పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. ద్విచక్రవాహనం నడిపే ప్రతీ ఒక్కరు హెల్మెట్‌ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే బీఎల్‌వోలకు ప్రజలు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పంపించాలని కోరారు. వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్‌ బేగం, పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్‌, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఈఈ అన్వర్‌, ఇంట్రా ఈఈ సుమలత, తహసీల్దార్‌ వరలక్ష్మి, ఎంపీడీవో స్నిగ్ధ, సర్పంచ్‌ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై దృష్టి పెట్టాలి

సిరిసిల్ల: జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై దృష్టి పెట్టి ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, హమాలీల సంఖ్య, గన్ని సంచులు, ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసి వేశారు అని అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్లు తుది దశకు చేరిన కేంద్రాల నుంచి హమాలీలు, వాహనాలను ఇతర కేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement