‘రాజన్న’ పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

‘రాజన్న’ పనుల్లో వేగం పెంచాలి

Jun 4 2026 9:25 AM | Updated on Jun 4 2026 9:25 AM

కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌

ఆలయ, ప్రధాన రోడ్డు విస్తరణ పనులు పరిశీలన

వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ ఆదేశించారు. వీటీఏడీఏ(వేములవాడ టెంపుల్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఆధ్వర్యంలో రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు, నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు, రాజన్న గుడి నుంచి బ్రిడ్జి వరకు ప్రధాన రోడ్డు విస్తరణ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని ఆర్‌అండ్‌బీ అధికారులనడిగి తెలుసుకున్నారు. రాజన్న ప్రధాన ఆలయ విస్తరణ, ప్రతీ అభివృద్ధి పనికి సంబంధించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. రాజన్న ఆలయం నుంచి మూల వాగు బ్రిడ్జి వరకు కొనసాగుతున్న ప్రధాన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి.. పురోగతి, పూర్తి చేయడంపై మున్సిపల్‌ అధికారులను ఆరా తీశారు. ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, వేములవాడ ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌శర్మ, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌ లోకేశ్‌, తహసీల్దార్‌ జయంత్‌, టీపీవో అన్సార్‌ పాల్గొన్నారు.

వార్డు సభలు నిర్వహించాలి

సిరిసిల్ల: గ్రామాల్లో వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌ అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈనెల 4, 6, 8, 10ల్లో నిర్వహించనున్న ప్రత్యేక గ్రామ, వార్డు సభలపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, మండల వ్యవసాయ అధికారులు, ఎంపీవోలతో బుధవారం అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌తో కలిసి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ప్రతీ గ్రామం, వార్డులో సభలు నిర్వహించి ప్రజలతో ప్రత్యక్షంగా చర్చించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను ముందుగానే గుర్తించి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు.

ప్రచారం చేయాలి

గ్రామ, వార్డు సభల్లో బడిబాట కార్యక్రమంపై విస్తత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండల, ఇంటర్‌ విద్యాధికారులు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈనెల 15 నుంచి ప్రారంభమయ్యే షెడ్యూల్‌ ప్రకారం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వేములవాడ ఆర్డీవో కె.ఎస్‌.బి.కుమారి, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, పంచాయతీ అధికారి షర్ఫుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

అన్‌ లోడింగ్‌ వేగం పెంచాలి

జిల్లాలో ధాన్యం అన్‌ లోడింగ్‌లో వేగం పెంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. అపరెల్‌ పార్క్‌, రైస్‌ మిల్లులు, గోదాముల్లో ధాన్యం అన్‌లోడింగ్‌, జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణపై జిల్లాధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి మాట్లాడారు. అపరెల్‌ పార్క్‌, రైస్‌ మిల్లులు, గోదాముల్లో అన్‌లోడింగ్‌ వేగవంతం చేయడం.. ఇప్పటివరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు మూసేశారు.. తదితర అంశాలపై ఆమె ఆరా తీశారు. అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ తదితర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచాలి

సిరిసిల్లటౌన్‌: జిల్లాలో ప్రభుత్వ బడిబాట కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రతీ పాఠశాలలో కనీసం 10 శాతం మేర విద్యార్థుల నమోదును పెంచాలని విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగితా రాణా సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల విద్యాశాఖ పనితీరును సమీక్షించి మాట్లాడారు. బడిబాట కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్త్తతంగా నిర్వహించి ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును పెంచాలని సూచించారు. కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, ఇంటర్మీడియట్‌ అధికారి శరత్‌, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకరచారి, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement