మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న గుడి వరకు రోడ్ల వెడల్పు నక్షా ఇలా..
మళ్లీ మొదలైన అభివృద్ధి పనులు
నిధులు రాగానే పరుగులు తీస్తున్న రోడ్డు పనులు
రాజన్న గుడి–బ్రిడ్జి మార్గం విస్తరణకు గ్రీన్ సిగ్నల్
రూ.6కోట్లతో 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం పునఃప్రారంభం
నాడు ఇరుగ్గా ఉన్న వేములవాడ రాజన్న గుడి నుంచి బ్రిడ్జి వరకున్న ప్రధాన రహదారి(ఫైల్), రూ.6కోట్ల నిధులతో ప్రారంభమైన డబుల్ రోడ్డు పనులు
వేములవాడ: రాజన్న ఆలయం నుంచి బ్రిడ్జి వరకు చేపట్టిన 80 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుమారు రూ.6కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనులు నిధుల కొరత కారణంగా కొంతకాలంగా నిలిచిపోయాయి. దీంతో స్థానిక ప్రజలు, వ్యాపారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. సైడ్ డ్రైనేజీలు, విద్యుత్ లైన్, రోడ్డు వెడల్పు పనులు, మట్టి తొలగింపు, నిర్మాణానికి సంబంధించిన యంత్రాల పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయి. రోడ్డు విస్తరణ పూర్తయితే రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకలు సులభతరం కావడంతోపాటు పట్టణ ట్రాఫిక్ సమస్యలకు కూడా కొంతమేర పరిష్కారం లభించనుంది. ప్రస్తుతం రోడ్డు పనుల కారణంగా దుమ్ము, ట్రాఫిక్ ఇబ్బందులున్నా.. పనులు పూర్తయిన తర్వాత వేములవాడ ప్రధాన రహదారికి కొత్త రూపు రానుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ అభివృద్ధి, పట్టణ సుందరీకరణలో భాగంగా ఈ రోడ్డు కీలకంగా మారనుంది.
60 ఏళ్ల కల సాకారం
గతంలో ఎన్నో చర్చలు జరిగినా.. కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజల్లో నిరాశానిస్పృహలు నెలకొన్నాయి. సీఎం రేవంత్, ఎమ్మెల్యే ఆది పట్టుదలతో చేపట్టిన కార్యాచరణ ఇప్పుడు ఆ కలకు ఆకారాన్నిచ్చాయి. ఇప్పటికే పాత భవనాల కూల్చివేత పూర్తయ్యింది. చుట్టుపక్కల గోడలు, నిర్మాణాలు ధ్వంసమవుతున్నా.. ప్రజల మనస్సుల్లో ఆశల పునాది పడింది. కోర్టు స్టేలు, ఇంటి యజమానుల ఆవేదనలు ఇలా అన్నింటిని అధిగమించుకొని పనులు మొదలయ్యాయి. 60 ఏళ్ల కల సాకారం కానుందని జనం సంబరపడిపోతున్నారు.
నిర్వాసితులు: 254 మంది
నిర్మాణాలు: 322
కావాల్సిన భూసేకరణ: 750 మీటర్లు
చేపట్టాల్సిన వెడల్పు: 80 ఫీట్లు


