మొదటి విడత పూర్తయిన 2,750 ఇళ్లు రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో జిల్లా లబ్ధిదారులకు రూ.169.19 కోట్ల చెల్లింపులు నేడు జిల్లాలో ఇందిరమ్మ సామూహిక గృహప్రవేశాలు
సిరిసిల్ల: పేదల ఆత్మగౌరవ ప్రతీక సొంతింటి కలను నెరవేర్చే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షలను నాలుగు విడతల్లో ఇవ్వగా.. లబ్ధిదారులు కొంత దానికి జమ చేసి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు. 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగులలోపు ఇంటిని నిర్మించుకున్నారు. నాలుగు దశల్లో.. బేస్‌మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడలు నిర్మి స్తే మరో రూ.లక్ష, ఇంటి స్లాబ్ వేసిన రూ.2 లక్షలు, నిర్మాణం పూర్తి చేసిన తరువాత మరో రూ.లక్ష మొత్తం రూ.5 లక్షలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయి. మహిళా సంఘాల్లో సభ్యులకు అదనపు ఆర్థిక సాయంగా బ్యాంకు రుణాలు అందించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 40 శాతం ఇళ్ల నిర్మాణంతో రెండో స్థానంలో నిలిచింది.
నూతన సాంకేతిక పరిజ్ఞానంతో..
జిల్లాలోని 11 మండలాల్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మోడల్ హౌస్‌లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రతీ మోడల్ హౌస్ లో హాల్, బెడ్‌రూమ్ అటాచ్డ్ బాత్రూం, కిచెన్ సదుపాయాలతో పూర్తి చేశారు. ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉండేలా సాంకేతికతను ఉపయోగించారు. స్లాబు నిర్మాణంలో పిల్లర్ రూఫింగ్ విధానాన్ని వినియోగించారు. ఇందులో సాధారణ ఇళ్లతో పోలిస్తే స్లాబ్ నిర్మాణంలో 40 శాతం ఖర్చు ఆదా అవుతుంది. నాణ్యతలో లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేశారు.
నిరంతర పర్యవేక్షణ
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, హౌసింగ్ క్షేత్రస్థాయి సిబ్బంది లబ్ధిదారులను కలుస్తూ నిర్మాణాలు వేగంగా జరిగేలా ప్రోత్సహిస్తున్నారు.
నేడు సామూహిక గృహప్రవేశాలు
జిల్లా వ్యాప్తంగా సోమవారం సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలకు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్ని మండలాల ప్రత్యేక అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేయాలని ఆదేశించారు. ఈమేరకు ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇందిరమ్మ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని అనేక మంది పేదలు నేడు సొంతింటిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు.


