కొయ్యకాలు కాల్చేస్తున్నారు
దెబ్బతింటున్న భూసారం
పర్యావరణానికి హానికరం
ప్రమాదాలతో ఆస్తి, ప్రాణ నష్టం
సిరిసిల్ల: వరికోతలు పూర్తయ్యాయి. వడ్ల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మరో వైపు వానాకాలం(ఖరీఫ్) సీజన్‌కు రైతులు పొలాలు దున్నుతూ తుకం(నారుమడి) పోస్తున్నారు. వరికోతలు పూర్తికావడంతో పొలాల్లోని వరి కొయ్యకాలును కాలబెడుతున్నారు. ఇలా కొయ్యకాలు, పంట అవశేషాలకు నిప్పు పెడితే సారవంతమైన భూముల్లో పోషకాలు నశించి, భూసారం క్షీణిస్తుందని వ్యవసాయాధికా రులు చెబుతున్నా రైతులు పట్టించుకోవడం లేదు.
ఎన్నో అనర్థాలు
పంట చేతికి వచ్చాక కొయ్యకాలును, పంట అవశేషాలను కాల్చితే అనేక అనర్థాలు తలెత్తుతాయని వ్యవసాయాధికారులు చెబుతున్నా రు. కొయ్యకాలు మంటలతో వచ్చే పొగతో ప ర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందంటున్నా రైతులు పట్టించుకోవడం లేదు. కొందరు రైతులు పొలాలను తడిపి జీలుగు విత్తనాలు విత్తుకుంటూ భూసారాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. మరికొందరు పెండను తరలించి, చెరువు మట్టిని పోస్తూ పంటకు లఘును అందిస్తున్నారు. కానీ చాలా మంది రైతులు భూమికి మేలు చేయకుండా మరింత కీడు చేసేలా వరికొయ్యలు కాల్చేస్తున్నారు.
మంటల్లో చిక్కి రైతు బలి
కొయ్యకాలు మంటల్లో చిక్కి ఓ రైతు బలైన ఘటన జిల్లాలో గురువారం విషాదం నింపింది. ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లికి చెందిన రైతు ఎలుక నర్సయ్య(65) వరిపొలం కొయ్యకాలు కాల్చుతూ గడ్డి మంటల్లో చిక్కుకుని చని పోయారు. మంటలు ఆర్పేందుకు వెళ్లి నర్స య్య బలికావడం ఆ ఊరిలో విషాదం నింపింది. మంటలు అదుపులోకి రాకపోగా.. కోళ్ల ఫా రాలు, గుడిసెలు, పైపులు, వ్యవసాయ పంపు సెట్లు దగ్ధమైన ఘటనలు ఉన్నాయి. కొయ్యకాలు కాల్చొద్దని తెలిసినా మారడం లేదు.
నేలలో సూక్ష్మజీవులు నశిస్తాయి
భూమిలో అనేక సూక్ష్మజీవులు పంటకు మేలు చేస్తాయి. వానపాములు(ఎర్రలు) లాంటి జీవులు అగ్నికి ఆహుతి అయిపోతాయి. భూసారాన్ని పెంచే వానపాములు క్షీణిస్తే సహజంగా పంటలకు సేంద్రీయ ఎరువును అందించే జీవులు లేకుండా పోతాయి. ఫలితంగా పంటకు సహజ సిద్ధమైన సేంద్రీయ ఎరువు కరువు అవుతుంది. భూసారం యథాస్థితికి చేరాలంటే.. మళ్లీ చాలా సమయం పడుతుంది.
కలియదున్నితే మేలు
నిజానికి కొయ్యకాలును తడిపి పొలంలోనే కలియదున్నితే కుళ్లిపోయి సేంద్రియ ఎరువు తయారవుతుంది. కాల్చడం ద్వారా భవిష్యత్‌లో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భూసారంలో లోపాలు తలెత్తి భూములు నిస్సారంగా మారుతాయి. ఎరువులు వాడుతూ.. పంటల దిగుబడి సాధిస్తున్నా.. ఇది భవిష్యత్ తరాలకు మంచి కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు పంటను కాల్చ కుండా కలియదున్నాలని, సేంద్రియ ఎరువులతో భూమికి, పంటకు ఎంతో మేలు కలుగుతుందని అవగాహన కల్పిస్తున్నారు.


