● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో పొగాకు వాడకాన్ని నివారిద్దామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. ఈనెల 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు వాడకంతో కలిగే నష్టాలను వివరిస్తూ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత, జిల్లా విద్యాధికారి జగన్‌మోహన్‌రెడ్డి, లేబర్ ఆఫీసర్ నజీర్ అహ్మద్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
జిల్లాలో జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే వేడుకలకు ప్రతీ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరుకావాలని సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, కలెక్టరేట్ ఏవో రామ్‌రెడ్డి పాల్గొన్నారు.
తుది దశకు ధాన్యం కొనుగోళ్లు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయని, ఇప్పటికే 2,33,758 టన్నులు కొనుగోలు చేశామని కలెక్టర్ తెలిపారు. ధాన్యం సేకరణ, లోడింగ్, అన్‌లోడింగ్, వాహనాల సమీకరణపై అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, పౌరసరఫరాల, సహకార, గ్రామీణాభివృద్ధి, మెప్మా అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే భరోసా రైతులకు కల్పించాలని సూచించారు.
బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచాలి
బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచాలని కలెక్టర్ సూచించారు. బడిబాటపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ బడిబాటను జూన్ 14 నుంచి 19 వరకు నిర్వహించాలని, 3 నుంచి ఉపాధ్యాయులు ఇంటింటి సర్వే చేసి బడీడు పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారి అంగన్‌వాడీ టీచర్ల సాయంతో ప్రతీ విద్యార్థిని ప్రైమరీ స్కూల్‌కు పంపించేలా చూడాలన్నారు. జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.
ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ చేయాలి
ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఎస్‌ఐఆర్–2026పై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ హాజరయ్యారు.


