● కాంగ్రెస్‌తోనే సంక్షేమం సాధ్యం ● మహిళలు ఆర్థికంగా ఎదగాలి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: రాష్ట్రంలో దివంగత నేత వైఎస్సార్ స్ఫూర్తితో ఉచిత కరెంట్ అమలవుతుందని, కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కే ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతీ మహిళను కోటీశ్వరులుగా చేసేందుకు ప్రజా ప్రభుత్వం వివిధ పథకాలు, రుణాలను మంజూరు చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 60 శాతం మహిళల సంఘాలకే ఇచ్చామని తెలిపారు. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేశామని, సిరిసిల్లలో 37వేల మందికి ఇస్తున్నామని వెల్లడించారు. రెండో దశలో కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు మంజూరు చేసిన బస్సులతో ప్రతి నెలా రూ.68వేల ఆదాయం వస్తుందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎరువుల షాపు లు ఇవ్వాలని, మహిళా సంఘాలకు ప్రతీ మండలానికి ఒకటి రైస్‌మిల్లు ఇవ్వాలని సూచించారు.
పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ.. బాల్య వి వాహాల నిర్మూలన, మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం–పరిష్కారాల చట్టం 2013 వివిధ అంశాలపై అవగాహన కల్పించామన్నారు. జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులు రుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకా ప్రభుత్వ సబ్సిడీ పథకాలు ఉన్నాయని, వాటి వివరాలు సంబంధిత శాఖల వద్ద పొందాలన్నారు.
రూ.కోట్ల రుణాలు పంపిణీ
జిల్లాలోని 337 సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ.40 కోట్లు, ఎఫ్‌పీసీ, ఎఫ్‌పీజీ సీఐఎఫ్ కింద 42 సంఘాలకు రూ.1.05కోట్లు, శ్రీనిధి రూరల్‌లో 278 సంఘాలకు రూ.7.13కోట్లు, బ్యాంక్ లింకేజీ మెప్మా రుణాలు 55 సంఘాలకు రూ.6.33 కోట్లు, శ్రీనిధి మెప్మాలో 61 సంఘాలకు రూ.1.50 కోట్ల విలువైన చెక్కులను, ధాన్యం కొనుగోలు కమీషన్ రూ.11.36 లక్షలను మహిళా సంఘాల బాధ్యులకు పంపిణీ చేశారు. వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములునాయక్, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, తహసీల్దార్ మహేశ్, ఏపీఎం పద్మయ్య, కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు.


