● రోజుకు 80 స్లాట్లు ● సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్వీవీ స్వామి
సిరిసిల్లటౌన్: భూముల మార్కెట్ విలువల పెంపు నేపథ్యంలో పెరిగిన రిజిస్ట్రేషన్ల కారణంగా రోజువారి స్లాట్ల సంఖ్యను పెంచినట్లు సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్వీవీ స్వామి తెలిపారు. ఈమేరకు శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్లకు రోజువారీ స్లాట్లు 40 నుంచి 80కి పెంచినట్లు పేర్కొన్నారు. కార్యాలయం సేవలను కూడా ఉదయం 9 నుంచి రాత్రి 7.30 గంటల వరకు పెంచినట్లు తెలిపారు. భూముల మార్కెట్ వాల్యూ పెరిగితే ఆ భారం తమపై పడుతుందన్న ఆందోళనతో విక్రేతలు, కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్లకు అఽధిక సంఖ్యలో వస్తున్నారన్నారు. శుక్రవారం 79 స్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని వివరించారు. రద్దీకి అనుగుణంగా డాక్యుమెంట్లు పెండింగ్ పడకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. క్రయ, విక్రేతల ఆందోళన చెందకుండా ఉండాలని, సందేహాల నివృత్తి, అవసరమైన సేవలు తమ కార్యాలయం సిబ్బంది అందజేస్తారని వివరించారు.


