ఇల్లంతకుంట(మానకొండూర్): గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని కందికట్కూర్ రేణుక ఎల్లమ్మ జాతరలో గురువారం పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రెండు రోజుల్లో పొద్దుతిరుగుడు కొనుగోళ్లు మొదలవుతాయని రైతులకు భరోసా ఇచ్చారు. వెల్జీపూర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లకోమటి శంకర్ తల్లి మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలోని కాంగ్రెస్ సోషల్ మీడియా గ్రామాధ్యక్షుడు సుధగోని రవీందర్ తండ్రి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ ఎంపీపీలు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, ఐరెడ్డి మహేందర్‌రెడ్డి, తిరుపతి, విజయ్, రజనీకాంత్, మహేశ్, సర్పంచ్ అరుకాల నవీన్‌కుమార్, మల్లేశం పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: జిల్లా నుంచి జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ జూనియర్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపికైనట్లు కోచ్‌లు ఎనగందుల శ్రీనివాస్, వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. జిల్లా స్పోర్ట్స్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చోడిబోయిన లోకేశ్, ఎర్నాల రాజశేఖర్ ఎంపికయ్యారు. వీరు ఒడిశా రాష్ట్రంలోని కుర్దలో ఈనెల 30 నుంచి జూన్ 3 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు గురువారం వెళ్లారు.
సిరిసిల్ల అర్బన్: టెక్స్‌టైల్ కోర్సు చదవడం ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలపై చేనేత, జౌళిశాఖ కోఆర్డినేటర్ మార్కండేయులు అవగాహన కల్పిస్తున్నారు. గురువారం చంద్రంపేటలో చేనేతకార్మికుల ఇళ్లకు వెళ్లి వివరించారు. పలువురు విద్యార్థులకు అప్లికేషన్ పత్రాలు అందజేశారు. రాష్ట్రస్థాయిలో 60 సీట్లు మాత్రమే ఉన్నాయని ఇప్పటి వరకు సిరిసిల్ల నుంచి 31 మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2500, కేంద్రం రూ.5వేల ఉపకారవేతనాలతోపాటు ఉద్యోగం కల్పించే అవకాశం ఉందన్నారు. వివరాలకు 99483 94061లో సంప్రదించాలని కోరారు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తడిసిన ధాన్యాన్ని మిల్లుకు తరలించాలని కోరుతూ మండలంలోని కిష్టునాయక్‌తండాలో రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. తూకం వేసిన బస్తాలను సకాలంలో మిల్లుకు తరలించకపోవడంతో అకాల వర్షానికి తడిసిపోయాయన్నారు. తడిసిన ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించే అవకాశం లేదని నిర్వాహకులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి తడిసిన ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. మాజీ సర్పంచ్ ప్రభునాయక్ తదితరులు ఉన్నారు.
పాడి రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం
వీర్నపల్లి(సిరిసిల్ల): మరణించిన పాడి రైతు కుటుంబాలకు కరీంనగర్ డెయిరీ అండగా ఉంటుందని డెయిరీ చైర్మన్ చెలిమెడ రాజేశ్వరరావు పేర్కొన్నారు. డెయిరీ పాడి రైతు భరోసా పథకంలో నమోదై, ఇటీవల మరణించిన అగ్రహారం పరిధిలోని 29 మంది పాడి రైతు కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. వీర్నపల్లికి చెందిన పాడిరైతు ఇసుకెళ్ల నారాయణ, మద్దిమల్లకు చెందిన పాలకేంద్రం సభ్యుడు జజ్జరి రామచంద్రం భార్య జజ్జరి లక్ష్మి ఇటీవల మరణించారు. వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు.


