కర్షకుల క‘న్నీరు’ | - | Sakshi
Sakshi News home page

కర్షకుల క‘న్నీరు’

May 28 2026 2:10 AM | Updated on May 28 2026 2:10 AM

● అకాల వర్షంతో తడిసిన ధాన్యం ● వారాల కొద్దీ కేంద్రాల్లో పడిగాపులు ● కొనసాగుతున్న కొనుగోళ్లు ● తూకం వేయాలని రైతుల డిమాండ్‌

● అకాల వర్షంతో తడిసిన ధాన్యం ● వారాల కొద్దీ కేంద్రాల్లో పడిగాపులు ● కొనసాగుతున్న కొనుగోళ్లు ● తూకం వేయాలని రైతుల డిమాండ్‌

సిరిసిల్ల: జిల్లాలో అకాల వర్షాలతో అన్నదాతలు అరిగోస పడ్డారు. ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. తూకం వేసిన బస్తాలు సైతం తడిసిపోయాయి. ఇదే సమయంలో వేములవాడ మండలం మల్లారం వద్ద 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. గన్నీ సంచుల కొరత, హమాలీల సమస్య, లారీల కొరత, రైస్‌మిల్లులు, గోదాముల్లో అన్‌లోడింగ్‌ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు కొనుసా గుతూనే ఉన్నాయి.

జిల్లా అంతటా వర్షం

జిల్లా అంతటా బుధవారం వర్షం కురిసింది. అత్యధికంగా ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌లో 32.5 మిల్లీమీటర్లు, నామాపూర్‌లో 29.8, వీర్నపల్లిలో 27.3, గంభీరావుపేటలో 24.0, సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద 21.8, ఎల్లారెడ్డిపేటలో 18.8, వేములవాడ అర్బన్‌ మండలం నాంపల్లి వద్ద 18.5, చందుర్తి మండలం మర్రిగడ్డ వద్ద 14.0, కోనరావుపేట మండలం నిజామాబాద్‌లో 14.0, రుద్రంగిలో 13.0, వేములవాడ రూరల్‌ మండలం మల్లారంలో 12.3, వట్టెంల వద్ద 8.3, బోయినపల్లిలో 12.0, తంగళ్లపల్లి మండలం నేరెళ్ల వద్ద 12.0, కలెక్టరేట్‌ వద్ద 10.3, ఇల్లంతకుంటలో 7.5, కందికట్కూర్‌లో 5.3, రుద్రంగి మండలం మానాల వద్ద అత్యల్పంగా 2.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

ప్రత్యేకాధికారుల పరుగులు

వర్షం కురవడంతో మండలాల ప్రత్యేకాధికారులు, ఐకేపీ సిబ్బంది, సహకారశాఖ అధికారులు, మెప్మా సిబ్బంది ధాన్యం పరిస్థితిని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వడ్లను తూకం వేయించారు. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కొనుగోళ్లు ఇలా..

కేంద్రాలు: 236

పూర్తయిన కేంద్రాలు: 9

ధాన్యం దిగుబడి అంచనా: 3 లక్షల టన్నులు

కొనుగోలు చేసిన ధాన్యం : 2,13,938.380 టన్నులు

ఇంకా కొనాల్సిన ధాన్యం: 86,162 టన్నులు

మిల్లులకు, గోదాములకు తరలించిన ధాన్యం: 2,03,793.340 టన్నులు

వడ్లు అమ్మిన రైతులు : 26,054

ధాన్యం విలువ: రూ.511.06 కోట్లు

ఇప్పటికే రైతులు ఖాతాల్లో జమయిన డబ్బులు: రూ.362.82 కోట్లు

డబ్బులు పొందిన రైతులు : 22,293

ఇది సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దబోనాలలో రైతు రాయనర్సు పరిస్థితి. తన ఐదెకరాల్లో వరి పంటను వేసి, పక్షం రోజుల కిందటే కోసి ఆరబెట్టి తూకం వేసేందుకు సిద్ధంగా రాశిపోశాడు. బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావడంతో వడ్లకుప్ప చుట్టూరా వరద చేరింది. దాదాపు 200 క్వింటాళ్ల వడ్లు చుట్టూ నీరు చేరడంతో ఆ నీటిని తొలగించేందుకు రాయనర్సు కుప్ప చుట్టూ ఇలా కాల్వ తీశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement