● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: మహిళలు నిర్భయంగా, ధైర్యంగా పనిచేయాలని, ఎలాంటి వేధింపులు ఎదురైనా నేరుగా ఫిర్యాదు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. కలెక్టరేట్‌లో మహిళా సంక్షేమ వారోత్సవాలను బుధవారం నిర్వహించారు. జిల్లాలో 278 ఇంటర్నల్ కమిటీ సభ్యులను ఆహ్వానించి వారికి అంతర్గత ఫిర్యాదుల కమిటీ గురించి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పనిప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం, పరిష్కారాల చట్టం–2013పై అవగాహన ఉండాలన్నారు. కలెక్టరేట్‌లోనూ ఒక పిజికల్ షి బాక్స్‌ను ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంకు సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం శిక్షకులు ప్రభాకర్, జిల్లా లోకల్ లెవెల్ కమిటీ సభ్యులు అఫ్జల్ బేగం, జ్యోతి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, సీడీపీవోలు సౌందర్య, ఉమారాణి, సుచరిత, డీ హబ్ కోఆర్డినేటర్ రోజా, డీసీపీవో కవిత, సఖీ అడ్మిన్ మమత, షీటీం ఇన్‌చార్జి ప్రమీల, బీసీ సంక్షేమాధికారి సౌజన్య, పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు పాల్గొన్నారు.
ఐఎంఎస్ భవన పనుల్లో వేగం పెంచాలి
జిల్లా ఇందిరా మహిళాశక్తి (ఐఎంఎస్) భవన పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని మెడికల్ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళాశక్తి భవన పనులను పరిశీలించారు. జూన్ 10లోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మహేశ్‌కుమార్, పీఆర్ డీఈఈ శ్రీనివాస్, ఏఈ సతీశ్ ఉన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లాలోని అధికారులతో మాట్లాడారు. వర్షాలతో తడిసిన ధాన్యంపై ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, లోడింగ్, అన్‌లోడింగ్‌లో వేగం పెంచాలని ఆదేశించారు.
మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళా సంఘాల సభ్యులు ఇందిరా మహిళాశక్తి భవనాలను సద్వినియోగం చేసుకోవాలని, స్వయం ఉపాధిపై దృష్టి పెట్టాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా గంభీరావుపేట మండలం రాజేశ్వర్‌రావునగర్‌లో నిర్మించిన ఇందిరా మహిళాశక్తి భవనాన్ని బుధవారం ప్రారంభించారు. ఇందిరా మహిళాశక్తి భవనాల నిర్మాణంలో రాష్ట్రస్థాయిలో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. అనంతరం సముద్రలింగాపూర్‌లో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి, గంభీరావుపేటలో గృహ నిర్మాణశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నమూనాను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తయిన 2,700 ఇందిరమ్మ గృహ ప్రవేశాలను జూన్ 1న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మండల కేంద్రానికి వచ్చిన కలెక్టర్ వీవోఏలు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. సర్పంచులు పిట్ల బాబు, కమ్మరి గంగసాయ వ్వ, మల్లుగారి పద్మ, ఏఎంసీ చైర్‌పర్సన్ కొమిరిశెట్టి విజయ, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఎంపీడీవో రాజేందర్, ఐకేపీ ఏపీఎం జయసుధ, సీసీలు సురేందర్, లావణ్య పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
వేములవాడరూరల్: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ నిర్వాహకులకు సూచించారు. వేములవాడ మండలం చెక్కపల్లి, బాలనగర్ ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి బుచ్చిబాబు, జిల్లా వ్యవసాయ అధికారి అబ్జల్ బేగం, సహకార శాఖ అధికారి రామకృష్ణ, తహసీల్దార్ జయంత్, ఏవో సాయికిరణ్, సింగిల్‌విండో సొసైటీ సీఈవో లక్ష్మణ్ ఉన్నారు.


