వేగవంతంగా పెన్షనర్ల లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ అక్కడక్కడా పలు సాంకేతిక సమస్యలు అయినా రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం ఇప్పటికే 81 శాతం పూర్తి జిల్లాలో 1,09,307 మంది చేయూత పెన్షనర్లు
సిరిసిల్ల: చేయూత పెన్షన్లలో అక్రమాలు అరికట్టేందుకు ప్రభుత్వం లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్(జీవన ధ్రువీకరణ) ప్రక్రియకు శ్రీకారం చుట్టగా చకచకా సాగుతోంది. రాష్ట్రంలో పెన్షన్ పొందే ప్రతీ ఒక్కరి ముఖ గుర్తింపును సెర్ఫ్ అధికారులు రూపొందించిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈమేరకు జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో మున్సిపల్ వార్డు అధికారులు, 260 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు తమ సెల్‌ఫోన్లలో లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ చేస్తున్నారు. పలుచోట్ల యాప్ ఓపెన్ కాకపోవడం, లబ్ధిదారుల ముఖం నమోదు కాకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నా రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానం ఉంది. కొన్ని గ్రామాల్లో సెల్‌ఫోన్ నెట్‌వర్క్ ప్రతిబంధంకంగా మారింది. సెర్ఫ్ అధికారులు మాత్రం ఈనెలాఖరులోగా లైవ్ అథెంటికేషన్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
81 శాతం నమోదుతో మొదటి స్థానం
జిల్లాలో చేయూత పెన్షన్లు పొందేవారు 1,09,307 మంది ఉండగా.. ఇప్పటికే 85,139 మంది పెన్షనర్ల లైవ్ అథెంటికేషన్ పూర్తయింది. 81 శాతం జీవన ధ్రువీకరణ నమోదుతో రాష్ట్రంలోనే జిల్లా అగ్రస్థానంలో ఉండడం విశేషం.
టెక్నికల్ ప్రాబ్లమ్స్
జిల్లా వ్యాప్తంగా పెన్షన్ పొందే వారిలో 196 మంది మరణించినట్లు తేలింది. 177 మంది పెన్షనర్ల వేలిముద్రలు, ముఖచిత్ర నమోదుకు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. 14 మంది మానసిక దివ్యాంగులు నమోదుకు దూరంగా ఉన్నారు. 38 మంది ఎక్కడ ఉన్నారో తెలియడం(నాట్ ట్రేస్) లేదని, ఆధార్ నంబరుతో పోల్చితే తప్పులు రావడంతో 8 మంది లైవ్ అథెంటికేషన్ నమోదు కావడం లేదు. ఆధార్‌నంబరు పరమైన సమస్యలు 1,054 మంది పెన్షనర్లకు ఉత్పన్నమయ్యాయి.
అర్హుల నిరీక్షణ
చేయూత పెన్షన్ల కోసం అర్హులు నిరీక్షిస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధాప్య పెన్షన్లు, బీడీకార్మిక, ఒంటరి మహిళలు కొత్త పెన్షన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే.. భార్యకు, భార్య చనిపోతే.. భర్తకు పెన్షన్‌ను బదిలీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ మార్పు చేయలేదు. ఫలితంగా జిల్లాలో అర్హతలు ఉన్నా చేయూత పెన్షన్ రావడం లేదు. ప్రభుత్వం జూన్ 2వ తేదీ తరువాత కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించడంతో అర్హుల్లో ఆశలు చిగురించాయి. ప్రజాపాలన గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా చేయూత పెన్షన్ల మంజూరు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారి అర్హతలను పరిశీలించి చనిపోయిన వారి స్థానాల్లో కొత్త వారికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. లైవ్ అథెంటికేషన్ పూర్తయితేనే చేయూతపై క్లారిటీ వస్తుందని అధికారులు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అధికారులు, పెన్షనర్లు కోరుతున్నారు.
చేయూత పెన్షన్ల స్వరూపం
వృద్ధాప్య పెన్షన్లు : 29,337
దివ్యాంగులు : 9,884
వితంతువులు : 20,758
చేనేత కార్మికులు : 3.138
కల్లుగీత కార్మికులు : 2,123
ఒంటరి మహిళలు : 1,740
బీడీ కార్మికులు : 41,463
ఫైలేరియా బాధితులు : 805
డయాలసిస్ బాధితులు : 59
మొత్తం పెన్షనర్లు : 1,09,307


