● అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్
సిరిసిల్ల: మాదక ద్రవ్యాలపై నిరంతరం నిఘా ఉంచాలని, వాటి వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ కోరారు. జిల్లాలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా నియంత్రణకు చేపడుతున్న చర్యలపై మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన ఎన్డీపీఎస్ కేసులు, మాదక ద్రవ్యాల సాగు నివారణ చర్యలు, విద్యార్థులు, యువత డ్రగ్స్ వినియోగించకుండా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలపై నిరంతర నిఘా కొనసాగించాలని, గ్రామస్థాయి నుంచి పట్టణాల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వ్యక్తులను గుర్తించి వారికి వైద్య సేవలు, కౌన్సెలింగ్ అందించేలా చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం ద్వారా బాధితులకు చికిత్స, మానసిక పరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఏఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, విద్యాసంస్థలు, పబ్లిక్ ప్రదేశాల్లో డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై పోలీస్, ఎకై ్సజ్, విద్యాశాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసరావు, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


