● వేములవాడలో జిల్లా కార్యాలయం ● మర్రిపల్లిలో 40 ఎకరాల్లో పరిశోధన కేంద్రం ● విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ/వేములవాడరూరల్: రైతాంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని సినారె కళామందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులకు నూతన పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం, నాణ్యమైన విత్తనాలు, పంట పొలాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ శాస్త్రవేత్తలు నిరంతరం అందుబాటులో ఉండాలని కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలో 40 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జిల్లా విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించి అక్కడ రైతులకు, శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణం జరిగే ప్రాంతంలో వివిధ అవసరాలకు రూ.25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య మాట్లాడుతూ, విజ్ఞాన కేంద్రంతో ఈ ప్రాంత రైతులకు లాభం చేకూరుతుందన్నారు. కేంద్రం కోఆర్డినేటర్‌గా డా.సాయికుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాజశ్రీ గార్డెన్స్‌లో వేములవాడ, సిరిసిల్ల డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్లుగా ముస్కు ముకుందరెడ్డి, రాజిరెడ్డి, కమిటీ సభ్యులు పులి లక్ష్మీపతిగౌడ్, మహేందర్‌రెడ్డి, వేణుగోపాల్, రవీందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డీఏవో అఫ్జల్ బేగం, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


