సిరిసిల్ల: జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్‌లు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మంగళవారం ఉదయం 15 బృందాలతో ఏకకాలంలో జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక దాడులు చేశారు. అధిక వడ్డీలతో ప్రజలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మహేశ్ బి గితే హెచ్చరించారు. సిరిసిల్ల పట్టణంతో పాటు వేములవాడ, రుద్రంగి, కోనరావుపేట ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి ఆరు కేసులు నమోదు చేశారు. రూ.1.39 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, రూ.1.77లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని అధిక వడ్డీలు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్ధతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే ప్రజలు నమ్మాలన్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయినా, అక్రమ ఫైనాన్స్ వ్యాపారం నడిపే వారి వివరాలు జిల్లా పోలీస్ కార్యాలయంలో తనకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.


