వీర్నపల్లి(సిరిసిల్ల): వీర్నపల్లి సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతాలను మంగళవారం రాజన్న సిరిసిల్ల– కరీంనగర్ జిల్లా అటవీ అధికారి ఎస్.సత్యనారాయణ క్షేత్రస్థాయిలో సందర్శించారు. అటవీ రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. అనంతరం అటవీ ప్రాంతాల్లో ఉపాధి పథకం ఆధ్వర్యంలో చేపడుతున్న భూసార, తేమ సంరక్షణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎఫ్‌వో మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లో చేపడుతున్న ప్రతీ పనిలో నాణ్యత లోపించకుండా, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సమర్థవంతంగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో ఎలాంటి అ క్రమ కార్యకలాపాలు జరగకుండా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించా లని సూచించారు. సిరిసిల్ల రేంజ్ అధికారి జి.నాగేశ్వరరావు, డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్‌లాల్, సెక్షన్ అధికారులు సకారాం, శ్రావణ్‌కుమార్, బీట్ అధికారులు కిరణ్, రజిత, సతీశ్, తిరుపతినాయక్, శ్రీకాంత్, అనూష తదితరులు పాల్గొన్నారు.
సదరం శిబిరాల తేదీలు
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జూన్‌లో నిర్వహించే సదరం శిబిరాల తేదీలు ఖరారు అయినట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం తెలిపారు. జూన్ 1న ఆర్థో(ఎముకల) శిబిరం ఉంటుందని, 4న వినికిడి, మానసిక వైకల్య పరీక్షలు, 5న ఆర్థో(ఎముకలు), వినికిడి, 8న ఆర్థో(ఎముకల), కంటిచూపు పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. 9న ఆర్థో(ఎముకల), 15న కంటిచూపు, 16న ఆర్థో(ఎముకల), 18న సాదారణ (జనరల్) పరీక్షలు జరుగుతాయని వివరించారు. సదరం శిబిరాలకు దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్ రే, యూడీఐడీ అప్లికేషన్ ఫాం, ఆధార్, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఫోన్ నంబరు వెంట తీసుకుని ఉదయం 9 గంటలకు జిల్లా ఆస్పత్రికి రావాలని ప్రవీణ్‌కుమార్ కోరారు.


