8 రకాల సన్నాలే సాగుచేయాలని ప్రభుత్వ ఆదేశం వాటికే బోనస్ ఇస్తామని ప్రకటన వెనకడుగు వేస్తున్న రైతులు 1.91లక్షల ఎకరాల్లో వరిసాగు అంచనా
చందుర్తి(వేములవాడ): వరి పంట అంటేనే దొడ్డురకాలు అని మన ప్రాంత రైతులకు తెలుసు. ఇటీవల సన్నరకాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ప్రకటించిన విష యం తెలిసిందే. అయితే సన్నాల సాగుకు ముందుకొచ్చే రైతులకు నిబంధనలు వర్తిస్తాయనడంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన 8 రకాలు సాగుచేసిన వారికే బోనస్ ఇ స్తామనడంతో అన్నదాతలు అయోమయానికి గు రవుతున్నారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలు మా ర్కెట్‌లో దొరకడం ఒక ఎత్తయితే.. సాగు సమయంలో ఛీడపీడలు తట్టుకుంటాయా.. లేదా.. అనే అనుమానాలు కలుగుతున్నాయి. సన్నరకాలు సాగు చేస్తే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా వస్తాయని రైతులు వాపోతున్నారు. ఈనేపథ్యంలో సన్నాలసాగు.. రైతుల అయోమయంపై ప్రత్యేక కథనం.
33 నుంచి 8 రకాలకు !
33 రకాలలో ఏది సాగు చేసినా బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం రెండేళ్ల క్రితం ప్రకటించింది. అయితే ఈ సీజన్‌లో 8 రకాలు.. అవి కూడా తాము సూచించినవే సాగు చేయాలని ప్రచారం చేస్తుంది. 8 రకాల విత్తనాలకు మార్కెట్‌లో డిమాండ్ ఉందని, దానికితోడు అధిక దిగుబడులు వస్తాయన్న ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం చెబుతున్నవి కాకుండా మారె్‌క్‌ట్‌లో నాణ్యమైనవి, అధిక దిగుబడి వచ్చే రకాలు అనేకం ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. బో నస్ ఎగవేత కుట్రలో భాగంగానే 8 రకాల వంగడాలు సాగు చేయాలన్న సాకు చూపుతుందని రైతులు విమర్శిస్తున్నారు. దొడ్డు రకాలు సాగు చేస్తే ఎకరంలో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, అదే సన్నాలు సాగుచేస్తే అదే ఎకరం భూమిలో 18 క్వింటాళ్లు కూడా రావని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాలు
జిల్లాలో 1.91 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయాధికారుల అంచనా. వ్యవసాయ శాఖ ప్రచారం చేస్తున్న రకాల్లో బీపీటీ–5204(సాంబమసూరి), ఆర్‌ఎన్‌ఆర్–15048(తెలంగాణ సోనా), కేఎన్‌ఎం–1638 (కూనారం వరి–2), జేజీఎల్– 1798(జగిత్యాల సన్నాలు), జైశ్రీరామ్, హెఎంటీ, సోనా వరంగల్–44(సిద్ది), డబ్ల్యూజీఎల్–962 మాత్రమే ఉన్నాయి.


