ఈత.. బీ కేర్‌ఫుల్‌ | - | Sakshi
Sakshi News home page

ఈత.. బీ కేర్‌ఫుల్‌

May 24 2026 1:15 AM | Updated on May 24 2026 1:15 AM

ఆకట్టుకుంటున్న జలవనరులు సెలవుల్లో పెరుగుతున్న ప్రమాదాలు పెద్దల సమక్షంలో నేర్చుకుంటేనే సంబురం పిల్ల చేష్టలతో ప్రమాదాలు కుటుంబాల్లో విషాదాలు

సరదా కన్నా ప్రాణం మిన్న

సిరిసిల్లటౌన్‌: దంచుతున్న ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు ఈత కోసం వాగులు.. వంకలు.. వ్యవసాయబావుల బాట పడుతున్నారు. ఇన్నాళ్లు స్కూల్‌.. కాలేజీ అంటూ తిరిగిన విద్యార్థులకు వాగులు.. వ్యవసాయబావుల్లో పరిస్థితులు తెలియక ప్రమాదాలకు గురవుతున్నారు. అప్పటి వరకు కేరింతలు కొడుతూ ఈత నేర్చుకున్న చిన్నారులు విగతజీవులుగా మారుతున్నారు.

కంటతడి పెట్టించిన సంఘటనలు

● జిల్లా కేంద్రం శివారులోని మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో ఈనెల 22న అల్లం మణికంఠ(17), ఎదురుగట్ల హరిచరణ్‌గౌడ్‌(17)తోపాటు మరో నలుగురు స్నేహితులు ఈత కోసమని వెళ్లారు. మణికంఠ, హరిచరణ్‌గౌడ్‌ వాగులోకి దిగి గుంతల్లో ఇరుక్కుని చనిపోయారు.

● ఈనెల 18న చందుర్తి మండలం బండపల్లి ఊరచెరువులో సృజన్‌(15) ఈత నేర్చుకోవడానికి వెళ్లి విగతజీవిగా మారాడు.

● కోనరావుపేట మండలంలో మార్చి 30న ఇద్దరు గొర్లకాపరులు ముడికె లక్ష్మీరాజం(65), కుమ్మం మొండయ్య(55) గొర్రెలకు స్నానం చేయిస్తూ చెరువులోని బురదలో ఇరుక్కుపోయారు.

● ముస్తాబాద్‌ మండలం మొర్రాపూర్‌తండాలో 2025 ఫిబ్రవరిలో భూక్యా చరణ్‌(17) చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు.

● ఆరేళ్ల క్రితం చందుర్తి మండలం మర్రిగడ్డ చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు చనిపోయారు.

● జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు, కార్గిల్‌లేక్‌ చెరువుల్లో గత దశాబ్దకాలంగా పదుల సంఖ్యలో ప్రమాదవశాత్తు చనిపోయారు.

ప్రమాదాల కారణాలు ఇవీ..

● నీటి పై భాగం ప్రశాంతంగా కనిపించినా లోపల ఉన్న గుంతలు, బురద, లోతు గురించి తెలియక ప్రమాదాలు జరుగుతున్నాయి.

● ఈత రాకపోయినా దోస్తుల ముందు గొప్పలకు పోయి ప్రమాదాలకు గురవుతున్నారు.

● పట్టణాల్లో మున్సిపల్‌ శాఖ, పల్లెల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేయాలి.

పోలీస్‌శాఖ సూచనలు ఇవీ..

● అనుభవజ్ఞులైన శిక్షకుల సమక్షంలో స్విమ్మింగ్‌ పూల్స్‌లోనే ఈత నేర్చుకోవాలి.

● చెరువులు, నదుల వద్దకు వెళ్లినప్పుడు ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలి. హెచ్చరికబోర్డులను గమనించాలి. ప్రమాదకరమైన ప్రాంతాలుగా ప్రకటించిన చోట నీటిలోకి దిగరాదు.

● చిన్న పిల్లలను నీటి వనరుల వద్దకు ఒంటరిగా పంపకూడదు.

● యువత అత్యుత్సాహంతో నీటి కొలనుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తల్లిదండ్రులు, తమ పిల్లలను కనిపెట్టుకుని ఉండాలి.

అది 2021 నవంబర్‌ 15. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు సమీపంలోని మానేరునదిలో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు మానేరులోని ఇసుక కయ్యల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ మునిగిపోయారు. వీరిని చూసి ముగ్గురు భయంతో పరారయ్యారు.

సరదా కన్నా ప్రాణం గొప్పదన్న విషయాన్ని గుర్తించాలి. విద్యార్థులు, యువకులు చేసే చిన్న తప్పిదం తల్లిదండ్రులకు జీవితకాలపు శోకాన్ని మిగల్చకూడదు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, నీటి వద్ద జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఈతను శిక్షకుల సమక్షంలో నేర్చుకోవాలి. సెలవుల్లో ఇంటి వద్ద ఉంటూ సురక్షితంగా ఉండండి.

– మహేశ్‌ బీ గీతే, ఎస్పీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement