రెక్కలు విరిగి.. నకనకలాడిపోతున్న వెలగ కోడి

Story Of MLA Velagapudi Ramakrishnababu Illegal Activities  - Sakshi

రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటోంది.... ముప్పై ఏళ్ల కిందట తెలుగు సినీ అభిమానులను ఓ రేంజ్‌లో  ఉర్రూత లూగించిన ఈ పాటను ఇప్పుడు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విషయానికి వచ్చే సరికి ఇదిగో ఇలా చదువుకోవాలి– రెక్కలు విరిగి నకనకలాడి అల్లాడిపోతున్న వెలగకోడి...  

ఎక్కడైనా వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు పేరు చెబితే వెంటనే ఆ ప్రాంత అభివృద్ధి గుర్తుకు రావాలి... ఆ ప్రాంతంలో ఆయన ఆధ్వర్యంలో చేసిన మంచి పనులు జ్ఞప్తికి రావాలి.. నియోజకవర్గ ప్రజలకు చేసిన ఎన్నో మేళ్ళు స్ఫురణకు రావాలి.. కానీ మూడు దఫాలుగా విశాఖ తూర్పున వెలగబెడుతున్న రామకృష్ణ పేరు చెప్పగానే... కోడి పందేలు.. దౌర్జన్యాలు.. మద్యం మాఫియా ఆగడాలు, భూ దందాలు. పంచాయితీలు..  ఇంతకుమించి ఆయన వెలగబెట్టిందేమన్నా ఉందా అంటే సొంత పార్టీ నేతలు కూడా నిజాయితీగా ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి.. ప్రభుత్వం ఉన్నా.. దాదాపు పదేళ్లు అడ్డగోలుగా నియోజకవర్గంపై పడిపోయి అందినకాడికి దోచేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన  తర్వాత పరిస్థితి తారుమారైంది. అసలేమయింది అనుకుంటున్నారా... అయితే  పూర్తి వివరాల కోసం లోపలికి రండి..

సాక్షి, విశాఖపట్నం :  అధికారం దన్నుతో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు గతంలో ఇష్టారాజ్యంగా చేసిన దందాలు, వ్యవహారాలు, దౌర్జన్యాలకు దాదాపు 20 నెలలుగా అడ్డుకట్ట పడింది. విజయవాడ మాజీ శాసనసభ్యుడు, దివంగత వంగవీటి మోహన్‌రంగా హత్యకేసులో మూడో నిందితునిగా పరారై ఇక్కడకి వలసొచ్చి.. ఆనక ’పరిస్థితులు’ కలసి రావడంతో ఎమ్మెల్యే గిరీ వెలగబెడుతున్న వెలగపూడి.. విశాఖ సంస్కృతికిపై తనదైన విషాన్ని చిమ్ముతూ వచ్చారు. 

► ముందుగా చెప్పాలంటే కోడి పందేలు...  గోదావరి జిల్లాల్లో పెద్ద పండక్కి ఆనవాయితీగా జరిగే సంప్రదాయ కోడి పందేలకు వెలగపూడి ఇక్కడ జూదం ముసుగు వేసి తెరలేపారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలకు భిన్నంగా అడ్డగోలుగా కోడిపందేలను దగ్గరుండి నిర్వహించేవారు.  ఈ వ్యవహారాలపై  2018లో సాక్షిలో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో అదే ఏడాది కోడి పందేల కేసులో వెలగపూడి అభిమానం సంఘం నేతను పోలీసులు అరెస్టు చేశారు. ఇక 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత  ఇక్కడ జూదం మాటున జరిగే కోడిపందేలకు పూర్తి స్థాయిలో అడ్డు కట్ట పడింది. ఐదారేళ్ళుగా కోడి పందేల బరులుతో విష సంస్కృతితో అల్లాడిన తూర్పు నియోజకవర్గంలో  గతేడాది  ఒక్క బరి కూడా గీయలేదు. ఇలా వెలగ’కోడి’కి పూర్తిగా రెక్కలు విరిగాయనే చెప్పాలి. 

► ఇక వెలగపూడి బ్యాచ్‌ చేసే దందాలకు ఏడాదిన్నరగా పూర్తిగా బ్రేక్‌ పడింది. తూర్పున అడ్డు అదుపు లేకుండా వెలగపూడి అనుచరులు.. షాపులు, వాణిజ్య వ్యాపార సంస్థలకు పెట్టే ’ఇండెంట్స్‌’ లేకుండా పోయాయి.  

► ఇది మరో భారీ దెబ్బ... దశాబ్దాల మద్యం మాఫియాకు ముకుతాడు పడింది. ఏడాదిన్నర కిందట వరకు ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే కాదు.. నగరం మొత్తంమీద మద్యం మాఫియాకు వెలగపూడే నాయకత్వం వహించే వారు. లెక్కకు మించిన బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో వాటాలున్నా... బినామీల పేరిట సొంతంగా నాలుగు షాపులు, రెండు బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లు నిర్వహించే వారు. ఆరిలోవ, పెదగదిలి, ఎంవీపీ కాలనీ,  జగదాంబ సెంటర్‌లలో షాపులు, ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదుట, ఓల్డ్‌ టౌన్‌లో బార్లు ఉండేవి. జగదాంబ సెంటర్‌లో షాపు స్వయంగా వెలగపూడి కుటుంబసభ్యుల పేరిటే ఉండేది. ఆయా షాపుల్లో కల్తీ మద్యం ఏరులై పారినా దాదాపు పదేళ్లు ఎవ్వరూ పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే ఎక్సైజ్‌  అధికారులు  కల్తీ మద్యంపై ఉక్కుపాదం మోపారు.

ఆ క్రమంలోనే వెలగపూడి చిట్టాలోని షాపుల్లో వరుసగా కల్తీ మద్యం విక్రయిస్తున్న దాఖలాలు బయటపడ్డాయి. కేసులు నమోదు చేసి పాత్రధారులను అరెస్టు చేశారు. వెంటనే సూత్రధారి వెలగపూడి బయటకు వచ్చి నానాయాగీ చేశారు. వెంకోజిపాలెంలో అక్రమ మద్యం విక్రయిస్తున్న విషయం బయటపడి కేసులు రాస్తే వెలగపూడి సీరియస్‌గా చేసిన ’యాక్షన్‌’ నవ్వులు పూయించింది. స్టేషన్‌ వద్దనే నిద్ర చేసి హడావుడి చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు. దరిమిలా నూతన మద్యం పాలసీ నేపథ్యంలో వెలగపూడి పూర్తిగా బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వహణను నుంచి తప్పుకున్నట్టే చెప్పాలి. అంటే దాదాపు 20ఏళ్లుగా మద్యం మహమ్మారితోనే వ్యాపారం.. కాదు కాదు... ఆ ముసుగులో దందాలు చేసిన వెలగపూడికి సరిగ్గా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే చెక్‌ పడింది. 

►  ఇక తాజాగా వెలగపూడి  భూదందాలపై అధికారులు ఉక్కుపాదం మోపారు. వెలగపూడి  భార్య పేరిట రుషికొండలో బీచ్‌ రోడ్డు సర్వే నెంబరు 21లో గెడ్డ పక్కన ఆక్రమించిన ఆరు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రేకుల షెడ్‌ను.. చుట్టూ ఉన్న ప్రహరీని తొలగించారు.  

►  ఈ వరుస పరిణామాల నేపథ్యంలో విశాఖ తూర్పు ప్రజలు హాయిగా స్వేచ్ఛావాయువులు పీలుస్తుంటే...  అన్ని అక్రమాల రెక్కలు తెగిన వెలగ’కోడి’ మాత్రం గిల గిలా కొట్టుకుంటోందని అంటున్నారు. అందుకే సదరు వెలగపూడి... విశాఖ సమగ్రాభివృద్ధిని కాంక్షించే రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డిపై లేనిపోని ఆయాసంతో అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని పచ్చ బ్యాచే ఆఫ్‌ ది రికార్డ్‌గా అంగీకరిస్తున్నారు. ఇంకెవరికైనా ఎనీ డౌట్స్‌.?. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top