జీవన్‌రెడ్డి ఖబడ్దార్‌ అంటూ సోషల్‌ మీడియాలో హెచ్చరికలు

Armur TRS Cadere Fires On MLA Jeevan Reddy Socialmedia - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ నియోజక వర్గంలో బెదిరింపుల రాజకీయం నడుస్తోంది!. సొంత పార్టీ వారిపైనే వేధింపుల పర్వం కొనసాగుతోంది.  విపక్ష నాయకులను, కార్యకర్తలను బెదిరించడంతో పాటు ఆయా పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను బలవంతంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. తాజాగా సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులనే బెదిరింపులకు గురి చేస్తుండడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో వారు సోషల్‌ మీడియా ద్వారా బహిరంగంగానే ఎమ్మెల్యేపై విరుచుకు పడుతున్నారు. జీవన్‌రెడ్డి ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు చేస్తున్నారు. 

నిధులు తెచ్చుకోవడమే కారణమా? 
మాక్లూర్‌ జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికైన దాదన్నగారి విఠల్‌రావు జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయన సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడు. మాక్లూర్‌ సొంత మండలం కావడంతో సహజంగానే ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు విఠల్‌రావుకు సన్నిహితంగా ఉంటున్నారు. అలాగే, ప్రొటోకాల్‌ మేరకు ఆయన అధికారిక కార్యక్రమాలకు సర్పంచ్‌లు హాజరవుతున్నారు. ఇది నచ్చని ఎమ్మెల్యే వారిని టార్గెట్‌గా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.  

► ముల్లంగి, బొంకన్‌పల్లి గ్రామాల పరిధిలోని నిజాంసాగర్‌ చివరి ఆయకట్టు వెయ్యి ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మాదాపూర్‌ బ్యాలెన్స్‌ ట్యాంక్‌ నుంచి ఎత్తిపోతల పథకం కోసం గతంలో ఇక్కడి టీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యేను అడిగినప్పటికీ నిధులు మంజూరు చేయించలేదు. దీంతో శ్యాంరావు ఆధ్వర్యంలో పలువురు జెడ్పీ చైర్మన్‌ను ఆశ్రయించి రూ.5 లక్షల జెడ్పీ నిధులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద మరో రూ.5 లక్షలు మంజూరు చేయించుకున్నారు.

ఇందుకు ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సహకరించారు. దీంతో మండల ప్రజాపరిషత్‌ సమావేశంలో విఠల్‌రావును సన్మానించారు. మరోవైపు, కల్లెడ గ్రామంలోని పాఠశాలలో వంట గది నిర్మాణం కోసం టీఆర్‌ఎస్‌ నేత ప్రసాద్‌గౌడ్‌ జెడ్పీ చైర్మన్‌ ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేయించుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఎమ్మెల్యే తమను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఆయా గ్రామాల నాయకులు వాపోతున్నారు.  

► ఇటీవల రైతుబంధు సంబురాల్లో జెడ్పీ చైర్మన్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తమపై కేసులు పెట్టిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కల్లెడ గ్రామపంచాయతీ సర్పంచ్‌కు సమాచారం లేకుండా పంచాయతీకి చెందిన అన్ని ఫైళ్లను ఎంపీవో ద్వారా తీసుకెళ్లారు. ఇంకా మరికొందరు సర్పంచ్‌లను ఇదే విధంగా వేధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు.

ఈ నెల 15వ తేదీన మాక్లూర్‌ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జెడ్పీ చైర్మన్‌ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించాల్సి ఉండగా, సర్పంచ్‌ వేములపల్లి సుబ్బారావును ఎమ్మెల్యే బెదిరించడంతో వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని అక్కడి నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలను ఇప్పటివరకు భరించామని, ఇకపై సహించేది లేదని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు చెబుతున్నారు.  

బయట పడుతున్న వేధింపులు.. 
ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆయనపై నేరుగా విమర్శలకు దిగడం కొత్త చర్చకు దారి తీస్తోంది. వందల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఎలా సంపాదించావంటూ ప్రశ్నిస్తుండడం సామాన్యుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మాక్లూర్‌ మండలంలోని ముల్లంగి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, సర్పంచ్‌ పావని భర్త శ్యాంరావు ఇటీవల సోషల్‌ మీడియా వేదికగా జీవన్‌రెడ్డిపై ఫైర్‌ అయ్యారు.

తనపై ఎమ్మెల్యే కేసులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అదే మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, సర్పంచ్‌ లావణ్య భర్త ప్రసాద్‌గౌడ్‌ కూడా ఎమ్మెల్యేపై విరుచుకు పడ్డారు. ఆర్మూర్‌ నియోజకవర్గాన్ని పీల్చిపిప్పి చేస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులతో కమాండ్‌ చేయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వీరిలాగే మరికొందరు సర్పంచ్‌లు బహిరంగంగానే ఎమ్మెల్యే వేధింపుల గురించి వాపోతున్నారు. మరికొందరు లోలోన రగిలి పోతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top