నమ్మించి గొంతు నులిమేశాడు.. | - | Sakshi
Sakshi News home page

నమ్మించి గొంతు నులిమేశాడు..

Jun 13 2026 1:47 PM | Updated on Jun 13 2026 1:47 PM

నమ్మించి గొంతు నులిమేశాడు.. చికెన్‌ బ్రాయిలర్‌ లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌ శ్రీ147 శ్రీ264 శ్రీ274

చికెన్‌

పాలకొండ/పాలకొండ రూరల్‌: మండలంలో సంచలనం సృష్టించిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి(32) హత్య కేసు మిస్టరీ వీడింది. ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపి, శారీరకంగా అనుభవించి పెళ్లి అనగానే ప్రియుడే గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని కారులో ఉంచి సినీ పక్కీలో చక్కెర్లు కొట్టారు. ఈ హత్యకు కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న ఓ స్టాఫ్‌నర్సు, మరో మిత్రుని సహకారం తీసుకున్న నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఒక్క రోజులోనే పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పాలకొండ డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం వెల్లడించారు.

పాలకొండ మండలం జంపరకోట పంచాయతీ బర్నసీతంపేట గ్రామానికి చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణికి, ఎం.సింగుపురం గ్రామానికి చెందిన రెడ్డి భువనేశ్వరకుమార్‌ అలియాస్‌ భువన్‌కు ఐదేళ్ల క్రిందట పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఉషారాణిని శారీరకంగా అనుభవించాడు. ఇంతలో ఎం.సింగుపురం ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామానికి చెందిన కృపారాణితో భువన్‌కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య కూడా శారీరక సంబంధం కొనసాగుతోంది. తనను దూరం పెడుతున్నాడని గ్రహించిన ఉషారాణి తనను పెళ్లి చేసుకోవాలని భువన్‌పై వత్తిడి చేసింది. ఈ విషయం స్టాఫ్‌నర్సు కృపారాణితో భువన్‌ చెప్పడంతో అందుకు ఉషారాణి అడ్డు తొలగించుకునేందుకు హత్య చేయాలని కృపారాణి సలహా ఇచ్చింది.

పక్కా ప్లాన్‌తో హత్య

తన ప్రేయసి ఉషారాణిని హత్య చేసేందుకు ప్రియుడు భువన్‌, స్టాఫ్‌నర్స్‌ కృపారాణితో కలిసి పక్కా ప్లాన్‌ చేశారు. ఉషారాణి స్పృహలో లేకుండా చేసి సులువుగా హత్య చేయవచ్చునని కృపారాణి సలహా ఇచ్చింది. ఇందులో భాగంగా రెండు స్ట్రిప్పుల నిద్రమాత్రలను కృపారాణి భువన్‌కు ఇచ్చింది. ఈ నిద్ర మాత్రలను డ్రింక్‌లో కలిపి ఉషారాణిచే తాగించాలని చెప్పింది. ఈ పథకం మేరకు ఈ నెల 5న సాయంత్రం ఉషారాణికి ఫోన్‌ చేసి 6వ తేదీన ఉదయం రాయిగఢ వెళదామని భువనేశ్వర్‌ పిలిచాడు. అప్పటికే తన తమ్ముడు వరసైన ఎం.సింగుపురం గ్రామానికి చెందిన సవిరిగాన తేజకు హత్య పధకం విషయాన్ని భువనేశ్వర్‌ తెలియజేశాడు. ఇందుకు తేజ ఓకే చెప్పి తన అన్నయ్యకు చెందిన ఎర్టిగా కారును తీసుకువచ్చాడు. భువనేశ్వర్‌ మాటలు నమ్మిన ఉషారాణి ఈ నెల 6న ఉదయం 9 గంటల సమయంలో బర్నసీతంపేట నుంచి బయలుదేరి డోలమడ గ్రామ సమీపానికి చేరుకుంది. అప్పటికే భువనేశ్వర్‌, తేజ కారుతో సిద్ధంగా ఉన్నారు. ఉషారాణిని కారులో ఎక్కించుకున్న వీరు దారిలో పల్పి ఆరెంజ్‌ డ్రింక్‌ కొనుగోలు చేసి ఆ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపారు. వీరఘట్టం చేరుకునే సరికి ఉషారాణికి వాంతులు కావడంతో నిద్రమాత్రలు కలిపిని పల్పీ ఆరెంజ్‌ ఇచ్చారు. కొంచెం డ్రింక్‌ తాగిన ఉషారాణి సరే పదండి అనడంతో రాయిఘడ చేరుకున్నారు. అప్పటికే రాయిఘడ ఆలయం మూసివేసి ఉంది. దీంతో తిరుగు ప్రయాణం అయ్యారు. మధ్యలో భోజనం చేద్దామని భువనేశ్వర్‌ అడగగా తనకు ఆకలిగా లేదని ఉషారాణి తెలపడంతో కనీసం ఈ పల్పీ ఆరెంజ్‌ అయినా తాగు అని చెప్పి నిద్ర మాత్రలు కలిపిన డ్రింక్‌ మొత్తం ఉషారాణితో తాగించారు. అక్కడి నుండి పాలకొండ మండలం నవగాం సెంటర్‌కు చేరుకుని ఉషారాణి తెలివిలో ఉందా.. లేదా.. అని పరీక్షించారు. అప్పటికే ఆమె పలుకుతుండడంతో ఈ విషయాన్ని స్టాఫ్‌నర్సు కృపారాణికి తెలిపారు. తాను బూర్జ సెంటర్‌ వద్ద ఉన్నానని, మీరు ఉషారాణిని తీసుకుని ఇటువైపు రమ్మని కృపారాణి తెలిపింది. బూర్జ సెంటర్‌కు వచ్చిన కారులో కృపారాణి ఎక్కింది. అక్కడి నుంచి శ్రీకాకుళం వైపు వీరంతా కారులో ప్రయాణం చేశారు. కొల్లివలస చేరే సరికి ఉషారాణి పూర్తిగా స్పృహ కోల్పోయిందని గుర్తించారు. కొల్లివలస దాటిన తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం వైపు కారు తీసుకువెళ్లారు. అక్కడ భువనేశ్వర్‌, తేజలు ఉషారాణి ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఉషారాణి చనిపోయిందని కృపారాణి నిర్దారించిన తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి ఆమదాలవలస సమీపంలో ఉన్న జియో పెట్రోల్‌ బంకు సమీపంలో ఉన్న చెరువులో ఉషారాణి మృతదేహాన్ని, ఆమె సెల్‌ఫోన్‌ను అక్కడ పడేసారు. ఇంతలో కారు యజమాని తనకు బేరం ఉందని కారు కావాలని ఫోన్‌ చేసి అడగడంతో శ్రీకాకుళంలో కారును అప్పగించేశారు. అక్కడి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్నారు. మృతదేహం అక్కడుంటే దొరికిపోతామని నర్సు కృపారాణి చెప్పింది. దీంతో భువనేశ్వర్‌, తేజ గ్రామంలో తెలిసిన వారి వద్ద కారు తీసుకుని అదే రోజు రాత్రి 1 గంట సమయంలో మృతదేహం వద్దకు వెళ్లారు. మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని పాలకొండ వైపు తీసుకువచ్చారు. దారిలోనే ఓ పెద్ద రాయిని సేకరించి కారులో పెట్టుకున్నారు. తొలుత పాలకొండలోని వెంకటరాయుని కోనేరులో పడేద్దామని అనుకున్నారు. అక్కడ జనసంచారం ఉండడంతో తుమరాడ సమీపంలో ఉన్న కామినాయుడు చెరువు వద్దకు వచ్చి మృతదేహం కాళ్లు చేతులు వెనక్కికట్టి, నడుముకు రాయికట్టి చెరువులో ఉషారాణి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. పక్కా ప్లాన్‌తో ఉషారాణిని భువనేశ్వర్‌, కృపారాణి, తేజ హత్య చేశారు.

ఒక్కరోజులోనే నిందితులు అరెస్టు

ఉషారాణి కనిపించడం లేదని ఈ నెల 10న తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇంతలో తుమరాడ సమీపంలోని చెరువులో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో ఆ మృతదేహం ఉషారాణిదేనని అందరూ గుర్తించారు. దీంతో డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ డోల వెంకన్న ఉషారాణి కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులను గుర్తించిన పోలీసులు శుక్రవారం సాయంత్రం కారులో వెళ్తున్న ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన హత్యానేరాన్ని అంగీకరించినట్లు ఎస్పీ మాధవరెడ్డి వివరించారు. ఈ ముగ్గురుపై హత్యా నేరం నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేనును త్వరితగతిలో ఛేధించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

పక్కా ప్లాన్‌తో ప్రియురాలి హత్య

తన స్నేహితుడు, మహిళా నర్సు సాయంతో యువతి హత్య

24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ మాధవరెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement