విజయనగరం ఫోర్ట్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షలు కొద్ది రోజులుగా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇటీవల కాలంలో బ్లడ్, యూరిన్ ఇన్‌ఫెక్షన్‌ల బారిన ఎక్కువ మంది పడుతున్నారు. వీరికి ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గదు. బ్లడ్ ఇన్‌ఫెక్షన్ ఉన్న వారికి బ్లడ్ కల్చర్, యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉన్న వారికి యూరిన్ కల్చర్ చేయాలి. కల్చర్ పరీక్షలో ఇన్‌ఫెక్షన్ తగ్గడానికి ఏ యాంటి బయాటిక్ మందులు వాడాలో తెలుస్తుంది. ఆ మందులు వాడితే ఇన్‌ఫెక్షన్ తగ్గుతుంది. అంతటి ప్రాధాన్యత గల కల్చర్ పరీక్షల విషయంలో సర్వజన ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
20 రోజులుగా నిలిచిన కల్చర్ పరీక్షలు
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత 20 రోజులుగా యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిపోయాయి. బోధనాస్పత్రి కావడంతో అన్ని వసతులు ఉంటాయని జిల్లా నలుమూలలు నుంచి అధిక సంఖ్యలో ఇక్కడకు రోగులు వస్తారు. జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి కూడా రోగులు ఇక్కడకు వస్తారు. అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉంటాయని రోగులు ఇక్కడకు వస్తారు. ఏదైనా వైద్య పరికరం పని చేయకపోతే వాటిని సకాలంలో బాగు చేయించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ణాశ్రయించాల్సిన పరిస్థితి. ఘోషాస్పత్రి నుంచి కూడా బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షల కోసం ఇక్కడకు శాంపిల్స్ పంపిస్తారు. ప్రస్తుతం పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
గత 20 రోజులుగా జరగని వైనం
అవస్థలు పడుతున్న రోగులు
ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు
బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షలకు రూ.500 నుంచి రూ.800 వరకు వెచ్చింపు
గంట్యాడ మండలానికి చెందిన అప్పలనాయడుకు జ్వరం రావడంతో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు బ్లడ్ కల్చర్ పరీక్ష రాశారు. అది పట్టుకుని ఆస్పత్రిలోని మైక్రో బయాలజీ ల్యాబ్‌కు వెళ్లగా కల్చర్ పరీక్ష చేయడం లేదని చెప్పడంతో ప్రైవేటు ల్యాబ్‌లో రూ.700 పెట్టి చేయించాడు.
విజయనగరం పట్టణానికి చెందిన గణేష్‌కు మూత్ర విసర్జన ఎక్కువ కావడంతో కొద్ది రోజులు క్రితం సర్వజన ఆస్పత్రికి వచ్చాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు యూరిన్ కల్చర్ పరీక్ష చేయమని చెప్పారు. మైక్రో బయాలజీ ల్యాబ్‌లో యూరిన్ పరీక్ష చేయాలని అడగ్గా యూరిన్ కల్చర్ చేయడం లేదని చెప్పడంతో ప్రైవేటు ల్యాబ్‌లో రూ.600 పెట్టి కల్చర్ పరీక్ష చేయించుకున్నాడు.
ప్రైవేటు ల్యాబ్‌లకు..
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కల్చర్ పరీక్షలు నిలిచిపోవడం వల్ల రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. అక్కడ అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి కల్చర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. యూరిన్ కల్చర్ పరీక్షకు రూ.500 నుంచి రూ.600, బ్లడ్ కల్చర్‌కు రూ.700 నుంచి రూ.800 వరకు వెచ్చిస్తున్నారు.
వాస్తవమే..
సర్వజన ఆస్పత్రిలో యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు నిలిచిన మాట వాస్తవమే. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్య వచ్చింది. త్వరలో సమస్య పరిష్కరించి యూరిన్, బ్లడ్ కల్చర్ పరీక్షలు అందుబాటులోకి తెస్తాం.
– డాక్టర్ అల్లు పద్మజ,
సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


