సిబ్బంది సమస్యలు సత్వరమే పరిష్కారం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది సమస్యలు సత్వరమే పరిష్కారం : ఎస్పీ

Jun 13 2026 1:47 PM | Updated on Jun 13 2026 1:47 PM

సిబ్బంది సమస్యలు సత్వరమే పరిష్కారం : ఎస్పీ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

పార్వతీపురం రూరల్‌: పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి శాఖాపరమైన, ఆరోగ్య సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం పోలీస్‌ వెల్ఫేర్‌(గ్రీవెన్స్‌ డే) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీస్‌ సిబ్బంది తమ సమస్యలను ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. సిబ్బందితో విడివిడిగా సమావేశమైన ఎస్పీ వారి అర్జీల పూర్వాపరాలను పరిశీలించి సానుకూల చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కాగా, సిబ్బంది నుంచి ప్రధానంగా బదిలీలు, అనారోగ్య సమస్యలకు సబంధించిన విజ్ఞాపనలే ఎక్కువగా వచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్‌కుమార్‌, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తెర్లాం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడిన సంఘటన ఇది. దీనికి సంబంధించి ఎస్‌ఐ సాగర్‌బాబు శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఆమిటి గ్రామానికి చెందిన కరణం రామకృష్ణ, బి.గౌరవ్‌ అనే ఇద్దరు యువకులు గురువారం రాత్రి మండలంలోని గొలుగువలస–సతివాడ గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గురువారం ఉదయం ఆమిటికి చెందిన రామకృష్ణ, గౌరవ్‌లు మోటార్‌ సైకిల్‌పై వంగర మండలం కురుంపురం గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లారు. అక్కడ నుంచి గురువారం రాత్రి సొంత గ్రామమైన ఆమిటి మోటార్‌ సైకిల్‌పై వస్తుండగా తెర్లాం మండలం గొలుగువలస–సతివాడ గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి పొలాల్లోకి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో వాహనం వచ్చి చికిత్స నిమిత్తం రాజాంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఇద్దరికి చికిత్స చేసి గౌరవ్‌కు తీవ్ర గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. రామకృష్ణ ప్రస్తుతం రాజాం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే ఎస్‌ఐ సాగర్‌బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన యువకుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

మద్దాల వంశీపై పీడీ యాక్ట్‌

విజయనగరం క్రైమ్‌ : గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా నిరోధక చట్టం క్రింద నిందితుడు మద్దాల వంశీ(24 )కి ఏడాది పాటు బెయిల్‌ లేకుండా జైలు శిక్ష విధించడం జరిగిందని ఎస్పీ దామోదర్‌ శుక్రవారం తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మరోసారి హెచ్చరించారు. 2 గంజాయి కేసుల్లో సుమారు 540 కిలోల గంజాయి తరలిస్తూ నిందితుడిగా అరెస్టు అయి ప్రస్తుతం సంవత్సర కాలం నిర్భంధించేందుకు సెంట్రల్‌ జైలుకు తరలించామన్నారు. నిందితుడు మద్దాల వంశీపై ఇప్పటికే జిల్లాలో సస్పెక్ట్‌ షీట్‌ ఉందన్నారు. విజయనగరం జిల్లా, ఎస్‌.కోట మండలం, తెన్ను బోడ్డవర గ్రామానికి చెందిన మద్దాల వంశీపై పి.డి.యాక్ట్‌ (గంజాయి, ఇతర మత్తు పదార్ధాల అక్రమ రవాణా నిరోధక చట్టం) చట్టాన్ని ప్రయోగించామని ఎస్పీ తెలిపారు. వంశీ చెడు వ్యసనాలకు అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, వ్యవస్థీకృత నేరస్తుడు శెట్టి ఉమా మహేశ్వరరావుతో కలిసి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవాడన్నారు. వంశీ కూడా వ్యవస్థీకృత నేరగాడిగా మారాడని పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. వంశీ ప్రవర్తన సమాజానికి హానికరంగా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తిగా మారాడని భావించి పి.డి.యాక్ట్‌ ప్రయోగించి విశాఖ సెంట్రల్‌ జైలుకు తరలించామని ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement