● రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు
విజయనగరం ఫోర్ట్: బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడం అందరి బాధ్యత అని ప్రభుత్వంతో పాటు అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ వి.సూర్యనారాయణ రాజు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువుకునే వయసులో చదువుకుంటేనే భవిష్యత్తు బాగుంటుందని తెలిపారు. చిన్న పిల్లలతో భిక్షాటన చేస్తూ కనపడితే చైల్డ్‌హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పిల్లలను ఇటుక బట్టీల్లో, హోటల్స్, ఫ్యాక్టరీల్లో పెట్టడం వల్ల వారి శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుందన్నారు. తల్లిదండ్రులు పేదరికం, నిస్సహాయత, సరైన అవగాహన లేకపోవడం దీనికి ప్రధాన కారణమన్నారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి కె.వి.బాలామణి, కార్మిక శాఖ ఉప కమిషనర్ ప్రసాదరావు, జెడ్పీ సీఈఓ నాగమణి, డీఈఓ మాణిక్యంనాయుడు, సీడబ్ల్యూసీ చైర్మన్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.


