అధికారుల తీరుపై.. అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

అధికారుల తీరుపై.. అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

అధికారుల తీరుపై.. అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

నకిలీ పత్రాలతో ప్రవాహ స్థలం రిజిస్ట్రేషన్‌

అడ్డుకున్న సబ్‌ రిజిస్ట్రార్‌కు డీఆర్‌వో మెమో జారీ చేయడం వింతగా ఉందని విమర్శ

పార్వతీపురం రూరల్‌: జిల్లా కేంద్రంలో పార్వతీపురం పరిధిలోని పెద్దకాన గెడ్డ కాలువ ప్రవాహ స్థలాన్ని కొందరు ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలతో ‘జిరాయితీ’ భూమిగా రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు యత్నించారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌ చంద్ర ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ రిజిస్ట్రేషన్‌ను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సబ్‌ రిజిస్ట్రార్‌ తొలుత నిలిపివేశారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే, సదరు ప్రైవేటు వ్యక్తి కోసం రిజిస్ట్రేషన్‌ చేయాలంటూ జిల్లా డీఆర్వో జోక్యం చేసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌కు మెమో జారీ చేయడం విస్మయం కలిగించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. సమావేశానికి ముందే జిల్లా రిజిస్ట్రార్‌తో తాను ఫోన్లో మాట్లాడినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌ను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే సీఎం, ఇరిగేషన్‌ మంత్రి దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తానని ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర మీడియా సమావేశంలో హెచ్చరించారు. సొంత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement