కృష్ణమ్మ ఒడిలో పెను విషాదం | - | Sakshi
Sakshi News home page

కృష్ణమ్మ ఒడిలో పెను విషాదం

Jun 15 2026 1:59 AM | Updated on Jun 15 2026 1:59 AM

కృష్ణమ్మ ఒడిలో పెను విషాదం ● అందరిదీ ఒకే కుటుంబం ● నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి

పెను విషాదంలో కోనూరు తీరని శోకంలో తల్లిదండ్రులు గ్రామంలో ఇదే తరహా ఘటన రెండోసారి

మృతుల కుటుంబాలకు

ప్రగాఢ సానుభూతి

● అందరిదీ ఒకే కుటుంబం
● నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి

అచ్చంపేట: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కృష్ణానదిలో మృతి చెందడంతో కోనూరు విషాదంలో మునిగిపోయింది. మండలంలోని కోనూరులో గంధం గంగయ్య ఇద్దరు మనమరాళ్లు, మనవడు, తమ్ముని కుమారుడు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ గ్రామంలో ఇలా జరగడం ఇది రెండవసారి. 2017 జనవరి 14వ తేదీన సంక్రాంతి నాడు ఒకే కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు నలుగురు కృష్ణానదిలో ఈత కొట్టడానికి వెళ్లి మృతి చెందిన ఘటనను గుర్తుకుతెచ్చుకుని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సరదాగా బయలుదేరి...

కోనూరు గ్రామానికి చెందిన గంధం గంగయ్య వ్యవసాయ కూలీ. బతుకుదెరువు కోసం గంగయ్య గ్రామం వదలి నకరికల్లు మండలం కుంకులగుంట గ్రామానికి వలసవెళ్లారు. కొన్ని సంవత్సరాలపాటు అక్కడ ఉన్నా నిలదొక్కుకోలేక పోవడంతో తిరిగొచ్చారు. గంగయ్య కుమారుడైన సత్యానందం– రాజ్యలక్ష్మి దంపతులకు కుమార్తెలు సంధ్య (11), షైని(9) ఉన్నారు. పిడుగురాళ్లలోని సున్నపుబట్టీలలో పనిచేసుకునేందుకు వీరు వలస వెళ్లారు. రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో ఉంటున్న కుమార్తె బత్తుల అరుణ కుమారుడు కార్తిక్‌ (11), చిలకలూరిపేటలో ఉంటున్న తమ్ముడు శ్రీనివాసరావు కుమారుడు చైతన్య (20). ఈ నలుగురు తమ తల్లిదండ్రులు, బంధువులతో గంగయ్య ఇంట్లో శనివారం రాత్రి జరిగిన ప్రార్థనలో పాల్గొనేందుకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి బంధువులంతా కృష్ణానది వద్దకు సరదాగా వెళ్లారు. సమీపంలో చేపల పడవలు కనిపించడంతో పడవలో నదిలో తిరగాలని ఉత్సాహపడ్డారు.

పడవ ఎక్కిన పది మంది...

వారిలో ముత్యాలు అనే వ్యక్తి పది మందిని పడవలో ఎక్కించుకుని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఉన్న లంక భూములకు వెళ్లాలని బయలుదేరారు. నది మధ్యలోకి వెళ్లేసరిగా పడవ అటు, ఇటు ఊగడం మొదలుపెట్టింది. పడవను నియంత్రించలేకపోయారు. అది కాస్తా తలకిందులైంది. అందరూ నీటలో పడిపోయారు. ముత్యాలు సాహసం చేసి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మిగిలిన నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పడవలతో వచ్చి ముమ్మరంగా గాలించారు. సంధ్య, షైని, కార్తిక్‌, చైతన్య మృతదేహాలు బయటపడటంతో తాత గంగయ్య తల్లడిల్లిపోయారు. సరదాగా వచ్చిన తమకు ఇలా పుత్రశోకంతో అల్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదేం కర్మ దేవుడా... అంటూ తలలు బాదుకున్నారు. ఆడుతూపాడుతూ తమ కళ్లెదుటే చిందులు వేస్తూ తిరిగిన పిల్లల మృతదేహాలను బంధువులు భుజాన వేసుకుని ఒడ్డుకు చేరుస్తుంటే తట్టుకోలేకపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆటోలు వేసుకుని తీసుకెళుతుంటే తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినట్లుగా శోకంతో అల్లాడిపోయారు. వారిని ఓదార్చడం గ్రామస్తులు, బంధువుల వల్ల కాలేదు. కోనూరు ఇసుక రీచ్‌లకు సమీపంలో గతంలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement