పల్నాడులో పెరిగిన దొంగతనాలు రెండు నెలల వ్యవధిలో పదికిపైగా భారీ చోరీలు రూ.కోట్లలో నష్టపోయిన బాధితులు కేసుల్లో పురోగతి లేక బాధితుల ఆవేదన శాంతిభద్రతలపై దృష్టి పెట్టని టీడీపీ సర్కారు
రాత్రివేళ కనిపించని గస్తీ..
ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన మూడో నేత్రం కనురెప్ప మూతపడనే లేదు.. అయినప్పటికీ దొంగల చేతివాటం ఆగడం లేదు. ధైర్యంగా ఉండండి అంటూ పోలీసులు ఇచ్చిన భరోసాకు దిక్కేలేదు. శాంతిభద్రతలపై దృష్టి పెట్టని చంద్రబాబు సర్కారు తీరుతో ఎప్పటిలానే వేసవి కాలంలో ఇళ్లకు తాళాలు వేసి ప్రయాణం కట్టిన కుటుంబాల ఇళ్లు గుల్లయ్యాయి. పోలీసులపై పెట్టుకున్న నమ్మకాన్ని సవాల్ విసురుతూ దొంగతనాలు పెరిగిపోయాయి.
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న చోరీలు ప్రజలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా తాళం వేసిన ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చెలరేగిపోతున్నారు. కుటుంబసభ్యులు ఊరు వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల చేస్తున్నారు. ఇంట్లో దాచిన బంగారం, నగదు, విలువైన వస్తువులను దోచుకెళ్తూ బాధితులకు కన్నీళ్లు మిగుల్చుతున్నారు. ఇటీవల కాలంలో పల్నాడు జిల్లాలో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడిన సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. దుండగులు ముందుగా తాళం వేసిన ఇళ్లపై నిఘా పెట్టి ఆ తర్వాత చోరీలకు పాల్పడుతున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో అత్యవసర పనులపై తాళం వేసి బయటకు వెళ్లాలన్నా ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో పోలీస్ గస్తీ సరిపడా లేకపోవటం, అనుమానస్పదవ్యక్తుల కదలికలపై పర్యవేక్షణ లోపించటం చోరీలకు ఆస్కారం కలిగిస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు చోటుచేసుకున్న చోరీ కేసుల్లో పూర్తి స్థాయిలో పురోగతి కనిపించలేదు. పోగొట్టుకున్న సొత్తు తిరిగి చేతికి అందకపోవటంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు జీవితకాల పొదుపులను కోల్పోయి కన్నీరుమున్నీరు అవుతున్నారు. దొంగలను గుర్తించి తాము పోగొట్టుకున్న సొత్తును తిరిగి ఇప్పించాలని పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు. చోరీల భయంతో ఇప్పటికే కొందరు గృహ యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోగా, మరి కొందరు రాత్రి వేళల్లో స్వచ్ఛందంగా గస్తీ నిర్వహిస్తున్నారు.
ఇవిగో నిదర్శనాలు
తలలు పట్టుకుంటున్న పోలీసులు..
ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న చోరీ కేసుల్లో పురోగతి లేకపోవటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిందితులను గుర్తించి సొత్తు రికవరీ చేయటంలో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైంది. జిల్లాలో గడిచిన రెండు నెలల వ్యవధిలో ఏదో ఒక ప్రాంతంలో గృహాలను కొల్లగొట్టి దోచుకువెళ్లటం యజమానులకే కాకుండా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటివరకు 11కు పైగా గృహాల్లో చోరీలు జరిగాయి. రూ.కోట్ల సొత్తును దుండగులు దోచుకెళ్లారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. దొంగతనాలను ఛేదించేందుకు పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా ఉపయోగం ఉండటం లేదు.
పోలీస్ గస్తీ రాత్రుళ్లు లేకపోవటంతో చోరులు చెలరేగిపోతున్నారు. యథేచ్ఛగా అల్లరిమూకలు, అసాంఘిక శక్తులు రాత్రుళ్లు మద్యం సేవించి స్వైరవిహారం చేస్తున్నాయి. గంజాయి తాగిన కొందరు యువత ద్విచక్రవాహనాలపై రాత్రుళ్లు తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. అనుమానస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచటంతోపాటు రాత్రుళ్లు గస్తీ పెంచి దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి వంటి అభివృద్ధి చెందిన పట్టణాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా తాళం వేసిన గృహాలను లూటీ చేయటం పోలీసుల భద్రత వైఫల్యాన్ని ప్రశ్నిస్తోంది.


