జాగ్రత్తగా లేకపోతే ఓటు కోల్పోయే ప్రమాదం ‘స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్’ ప్రక్రియకు సర్వం సిద్ధం నేటి నుంచి ఇంటింటికీ బూత్ స్థాయి అధికారులు
ముఖ్యమైన తేదీలు ఇవీ...
నేటి నుంచి జూలై 14వ తేదీ వరకూ బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. అలాగే జూలై 14 నాటికి పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ పూర్తి చేస్తారు.
జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ ఓటర్ల జాబితా పై క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు.
జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకూ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు.
సెప్టెంబర్ 22న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు.
జిల్లాలో ఓటర్లు, మ్యాపింగ్ వివరాలు
సత్తెనపల్లి: భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటరు జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (సర్) సర్వేలో భాగంగా బూత్ లెవెల్ అధికారి (బీఎల్‌ఓ) ఇచ్చే ఎన్యుమరేషన్ ఫారం–2ను ఓటరు నింపి మళ్లీ అందజేయాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తిగత వివరాలతోపాటు తన కుటుంబం 23 ఏళ్లుగా భారతదేశంలోనే ఉన్నట్టు ధ్రువీకరించే వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలోనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అధికార పార్టీ వారు ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను టార్గెట్ చేసి ‘23 ఏళ్ల నివాసం’ పేరుతో భారీగా ఓట్లు గల్లంతు చేస్తారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలతోపాటు ఓటర్లు అప్రమత్తంగా లేకపోతే పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతయ్యే అవకాశం
అప్రమత్తంగా ఉండాల్సిదే..
జిల్లాలోని నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల.. ఇలా ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17.41 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. గతంలో 2002లో చివరిసారిగా ‘సర్’ ప్రక్రియ చేపట్టారు. సరిగ్గా 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం బీఎల్‌ఓలు 2002 ఓటరు జాబితా ప్రాతిపదికన ప్రస్తుత ఓటరు జాబితాను పరిశీలిస్తారు. ఈ నెల 15 (సోమవారం) నుంచి జూలై 14వ తేదీ వరకూ బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ వచ్చి సర్వే చేస్తారు. సర్వే వివరాల ఆధారంగానే ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితా వెల్లడిస్తారు.
ఫాం–2 లో ఏం నింపాలంటే...
‘సర్’ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫాం–2 నింపి బీఎల్‌ఓకు అందజేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఈ ప్రక్రియ అంత సులువు కాదు. 2002 నాటి ఓటరు జాబితాలో మీ పేరుంటే.. ఆ వివరాలు ఎన్యూమరేషన్ ఫాంలో నింపాలి. అప్పటి జాబితాలో మీ పేరు లేకపోతే.. మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదంటే ఇతర కుటుంబికుల పేర్లు ఉంటే వారి వివరాలు నమోదు చేయాలి. వీటితోపాటు మీ పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నెంబర్, తండ్రి/ సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య/ భర్త పేరు, వారి ఎపిక్ నెంబర్ (అందుబాటులో ఉంటే) తదితర వివరాలు నింపి, కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫొటో అతికించి బీఎల్‌ఓకు అందజేస్తే ఇందుకు రసీదు ఇస్తారు. దీన్ని తప్పనిసరిగా భద్రపరుచుకోవాలి.
ఎలాంటి అపోహలు వద్దు
సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి కె.గోపాలకృష్ణ మాట్లాడుతూ.. ‘సర్ ప్రక్రియపై అర్హులైన ఓటర్లు అపోహలు, ఆందోళన చెందాల్సిన పనిలేదు. చనిపోయిన వారి ఓట్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లును మాత్రమే తొలగిస్తారు. 2002 నాటి ఓటరు జాబితాను బీఎల్వోలు తీసుకొని ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. 2002లో ఓటు హక్కు ఎక్కడ ఉన్నది అనేది తెలియజేస్తే బీఎల్‌ఓ దాన్ని నమోదు చేస్తారు. అక్కడ వారి కుటుంబికుల ఓట్లతో సరి చూస్తారు. 15 వ తేదీ నుంచి బీఎల్వోలు సర్వే నిర్వహిస్తారు. ప్రతి బీఎల్‌ఓ ప్రతి ఇంటిని మూడుసార్లు సందర్శిస్తారని’ చెప్పారు.
నియోజకవర్గం ఓటర్లు మ్యాపింగ్ మ్యాపింగ్ పూర్తి శాతం
పూర్తయిన వారు కాని వారు
నరసరావుపేట 2,33,756 1,71,911 61,845 73.54
చిలకలూరిపేట 2,26,959 1,51,993 74,966 66.97
వినుకొండ 2,66,031 1,80,096 85,935 67.70
సత్తెనపల్లి 2,43,048 1,78,047 65,001 73.26
పెదకూరపాడు 2,34,112 1,90,465 43,647 81.36
గురజాల 2,75,091 1,98,779 76,312 72.26
మాచర్ల 2,62,801 1,78,325 84,476 67.86
మొత్తం 17,41,798 12,49,616 4,92,182 71.74


