జాతీయ ఈత పోటీలకు టెక్నికల్‌ అధికారిగా సురేష్‌ | - | Sakshi
Sakshi News home page

జాతీయ ఈత పోటీలకు టెక్నికల్‌ అధికారిగా సురేష్‌

Jun 15 2026 1:59 AM | Updated on Jun 15 2026 1:59 AM

జాతీయ ఈత పోటీలకు టెక్నికల్‌ అధికారిగా సురేష్‌ ఇద్దరిని కాపాడిన రక్షణ బృందం బీసీల కులగణన శాసీ్త్రయంగా చేపట్టాలని వినతి నేడు కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

నరసరావుపేట ఈస్ట్‌: శ్రీసుబ్బరాయ అండ్‌ నారాయణ కళాశాల స్విమ్మింగ్‌ పూల్‌ కోచ్‌ జి.సురేష్‌ 79వ సీనియర్‌ జాతీయ ఆక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు టెక్నికల్‌ అధికారిగా నియమితులయ్యారు. గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. స్విమ్మింగ్‌ కోచ్‌గా కొనసాగుతున్న సురేష్‌ గతంలోనూ పలు అంతర్జాతీయ, జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీలకు పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఆక్వాటిక్స్‌లో సురేష్‌కు ఉన్న నైపుణ్యానికి, నిబద్ధతకు ఈ ఎంపిక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. సురేష్‌కు కళాశాల యాజమాన్య ప్రతినిధులు, పల్నాడు జిల్లా సిమ్మింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

బాపట్ల: సూర్యలంక బీచ్‌ వద్ద సముద్రంలో నీటిలో గల్లంతైన బాలుడిని సాహసోపేతంగా పోలీసులు, మైరెన్‌ సిబ్బంది ఆదివారం కాపాడారు. మధ్యాహ్నం సమయంలో కర్లపాలెంకు చెందిన కంబం కమల్‌ దాస్‌ (17) తన నలుగురు స్నేహితులతో సూర్యలంక బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి లోతైన నీటిలోకి కొట్టుకుపోయాడు. విధుల్లో ఉన్న మైరెన్‌, బాపట్ల రూరల్‌ పోలీసులు బాలుడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు.

మరో ఘటనలో..

చీరాల: చీరాల మండలం తోటవారిపాలేనికి చెందిన అఖిలేష్‌ (17) కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాడరేవు సముద్రతీరానికి వచ్చాడు. అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో పోలీసులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

తెనాలి: డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు కమిషన్‌కు విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ట్రిపుల్‌ టెస్ట్‌ ఆర్డర్‌ సంతృప్తికరంగా అమలు జరిపేలా, బీసీ రిజర్వేషన్‌ వర్గీకరణ చేయాలని, రాష్ట్రంలో బీసీల కుల గణన ద్వారా సరైన డేటా సేకరించి రిజర్వేషన్ల పెంపునకు కమిషన్‌ సహకరించాలన్నారు. జనగణన వివరాలను బీసీ కులగణన సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలన్నారు. బీసీల ప్రధాన డిమాండ్లతో కూడిన విజ్ఞాపనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా చట్టసభలలో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్‌ కోటా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు జనాభా దామాషాలో దక్కేలా తోడ్పడాలన్నారు. బీసీ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, జె.నాగమోహన్‌, జె.మురళి, ములికి జయకృష్ణ, జె.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బాపట్ల: జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కరవేదిక(పీజీఆర్‌ఎస్‌) సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడవలేని, మంచాలకు పరిమితం అయిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకురావద్దని సూచించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పని సరిగా హెల్మెట్‌ పెట్టుకొని రావాలి కోరారు. ‘మీకోసం టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1100’ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement