రెయిన్‌ట్రీ పార్క్‌ విల్లాలో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

రెయిన్‌ట్రీ పార్క్‌ విల్లాలో భారీ చోరీ

Jun 15 2026 1:59 AM | Updated on Jun 15 2026 1:59 AM

రెయిన్‌ట్రీ పార్క్‌ విల్లాలో భారీ చోరీ

సుమారు 475 గ్రాముల బంగారం చోరీ

మంగళగిరి టౌన్‌: మంగళగిరి ప్రాంతంలోని ఓ విల్లాలో శనివారం రాత్రి భారీ చోరీ జరిగింది. మంగళగిరి మండలం కాజ గ్రామం రెయిన్‌ట్రీపార్క్‌లోని ఓ విల్లాలో అడ్వకేట్‌ శైలేంద్ర నివాసముంటున్నాడు. ఆయన భార్య చినకాకానిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. శైలేంద్ర నివాసముంటున్న విల్లా సెకండ్‌ ఫ్లోర్‌లో అతడి తల్లిదండ్రులుంటున్నారు. శైలేంద్ర భార్య శనివారం రాత్రి ఆస్పత్రిలో నైట్‌ డ్యూటీకి వెళ్లింది. స్నేహితులను కలిసేందుకు శైలేంద్ర శనివారం సాయంత్రం విజయవాడ వెళ్లాడు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున తను విల్లాకు చేరుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న గదికి వెళ్లగా.. అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో పాటు, ఆల్మరాలు తెరిచి ఉన్నాయి. మెయిన్‌ బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన ఐరన్‌ సేఫ్‌ కనిపించలేదు. సెకండ్‌ ఫ్లోర్‌లో శైలేంద్ర తల్లిదండ్రులు ఆ సమయానికి నిద్రపోతున్నారు. వారి గది తప్ప విల్లాలోని అన్ని గదుల్లో ఉన్న ఆల్మరాలు తెరిచి ఉండటంతో ఇంట్లో దొంగలు పడ్డారని నిర్ధారించుకుని వెంటనే భార్యకు సమాచారం ఇచ్చాడు. మాస్టర్‌ బెడ్‌రూమ్‌ సేఫ్‌ లాకర్‌, డెస్క్‌లో ఉన్న బంగారు ఆభరణాలు సుమారు 475.5 గ్రాములు, రూ.3 లక్షల విలువైన పలు వస్తువులు, 350 యూఎస్‌ డాలర్లు చోరీకి గురైనట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదివారం విల్లాను పరిశీలించారు. పోలీసు జాగిలాల బృందం సాయంతో నిందితుల ఆనవాళ్లను గుర్తించాలని, సీసీ టీవీ ఫుటేజ్‌లను, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement