1.70 ఎకరాల నీటి కుంటపై టీడీపీ వంకర రాజకీయం కుంటను పూడ్చివేసి జిల్లా పార్టీ కార్యాలయానికి కేటాయించే కుట్ర సాగు, తాగు నీటి అవసరాలకు విఘాతం పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులో పచ్చ నేతల కుతంత్రం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులు
న్యాయం కోసం వైఎస్సార్ సీపీ పోరాటం
నరసరావుపేట రూరల్: కోట్లాది రూపాయల విలువైన చెరువు భూమిని నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీకి అప్పగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్న ఘటన నరసరావుపేట శివారులో ఉన్న ఇస్సపాలెం బైపాస్ రోడ్డు వద్ద సాయినగర్ సమీపంలోని సర్వే నంబర్ 49లో చోటుచేసుకుంది. ఇక్కడ పెద్దకుంట చెరువుగా పిలిచే వంకాయలవారి కుంట 1.70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ చెరువు నీటిని రైతుల పంట పొలాలకు వినియోగిస్తుంటారు. దీంతో పాటు స్థానికుల తాగునీటి అవసరాలకు చెరువు ఉపయోగపడుతుంది. కాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం కోసం ఆ పార్టీ నాయకులు పలు చోట్ల స్థల పరిశీలన చేశారు. పార్టీ కార్యాలయం నిర్మాణానికి అంత అనుకూలంగా స్థలాలు లేకపోవడం, అనుకూలంగా ఉన్న స్థలాలు వివాదంలో ఉండటంతో వీరి కన్ను వంకాయలవారి కుంటపై పడింది. అంతే వెంటనే ఈ ప్రాంతం లీజు కోసం దరఖాస్తు చేశారు. ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ సీసీఎల్‌ఏకు పంపినట్టు సమాచారం.
కోట్లాది రూపాయల భూమి కొట్టేసే యత్నం
మరోవైపు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో చెరువు పూడ్చివేత పనులను స్థానిక నాయకులు చేపట్టారు. చెరువులోని నీటిని ట్రాక్టర్ ఇంజన్‌ల ద్వారా బయటకు తరలించారు. ములకలూరు నుంచి వందలాది టిప్పర్లతో మట్టిని తీసుకువచ్చి చెరువును పూర్తిగా మట్టితో నింపారు. చెరువు పూడ్చివేతపై స్థానికులు, రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయినా అధికారులు కానీ, టీడీపీ నేతలు కాని పట్టించుకోలేదు. సాయినగర్ ప్రాంతంలో ఎకరం రూ.5 కోట్లుకు పైగా పలుకుతుంది. దీని ప్రకారం చెరువు భూమి విలువ దాదాపు రూ.8.5 కోట్ల పైమాటే. ఇంత విలువైన భూమిని.. అదీ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే వాటర్ బాడీలను పార్టీ కార్యాలయానికి కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకుల ఒత్తిడితో జిల్లా అధికారులు పనిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
–డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ‘గ్రామానికి చెందిన రైతులతో కలిసి పీజీఆర్‌ఎస్‌లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. ఫలితం శూన్యం. చెరువులను ఇతర అవసరాలకు కేటాయించవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన మార్గదర్శకాలను ఇక్కడ ఉల్లంఘిస్తున్నారు. సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడే చెరువును పూడ్చివేయడం దుర్మార్గం. ఈ అక్రమ వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ స్పందించి టీడీపీ జిల్లా కార్యాలయానికి ఈ భూమిని కేటాయించే ప్రతిపాదనలను విరమించుకోవాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అంతకుముందు ఆక్రమణకు గురైన చెరువును డాక్టర్ గోపిరెడ్డి పరిశీలించారు.


