వ్యక్తికి తీవ్రగాయాలు రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
మాచర్ల రూరల్: రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కంభంపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎం.బ్రహ్మారెడ్డి కంభంపాడు గ్రామంలో తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి మాచర్ల వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీ కొట్టింది. దీంతో అతడికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డుపై గ్రామస్తుల నిరసన
నేషనల్ హై వే రోడ్డు గ్రామం మీదుగా ఏర్పాటు చేసి వీధి లైట్లు మాత్రం వెలిగించకపోవటంతో గ్రామంలోకి వెళ్లాలన్నా, రావాలన్నా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే ప్రమాదాలు చాలా జరిగినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు చేరి ఎద్దుల బండ్లు, నీళ్ల ట్యాంకులను అడ్డుగా పెట్టి ధర్నాకు దిగారు. గ్రామంలో హైవేపై లైట్లు వెలగటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్‌లను గ్రామంలో ఆపాలని ఆర్టీసీ అధికారులకు కోరుతున్నా స్పందించటం లేదని వాపోయారు. అతి పెద్ద జనాభా కలిగిన గ్రామ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవటంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపులా సుమారు కిలో మీటర్ దూరం వాహనాలు నిలిచిపోయాయి. రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ లభించేంత వరకు కదిలే ప్రసక్తే లేదంటూ ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు విజయపురిసౌత్, రూరల్ ఎస్‌ఐలు అశోక్‌కుమార్, సంధ్యారాణి ఉన్నతాధికారులకు తెలిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


