తెనాలిరూరల్: అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల లీలలు విచిత్రంగా ఉన్నాయి. అధునాతన వాహనాన్ని వెనక్కి తీసుకుని పాత వాహనాన్ని తెనాలికి పంపారు. ఏప్రిల్ 14వ తేదీన తెనాలి అగ్నిమాపక కార్యాలయానికి ప్రత్యేక అగ్నిమాపక శకటాన్ని కేటాయించి పంపారు. పంపిన రెండు రోజులకే వెనక్కి పిలిపించి రాష్ట్ర సచివాలయంలో ఉంచారు. పరిధి పెద్దదైన తెనాలి కార్యాలయం కింద తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు, బాపట్ల జిల్లా చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇక్కడ దశాద్దాల క్రితమే రెండు వాహనాలు అవసరముందని భావించిన అధికారులు రెండు వాహనాలను కేటాయించారు. ఒక వాహనం దశాబ్దంన్నర క్రితం శిథిలావస్థకు చేరుకోగా అప్పటి నుంచి కేవలం ఒక్క వాహనంతోనే నెట్టుకువస్తున్నారు. ఇటీవల రెండో వాహనం కేటాయించి పంపడంతో అగ్నిప్రమాదాల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. ఈ ఆనందం కేవలం రెండు రోజుల్లోనే ఆవిరైపోయింది.
ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి!
Jun 15 2026 1:53 AM | Updated on Jun 15 2026 1:53 AM
● గత నెల 12వ తేదీన బాపట్ల జిల్లా చుండూరు మండలం పెనుగుదురుపాలడులో గడ్డివామి దగ్ధమవుతుందన్న సమాచారంతో శకటం అక్కడకు వెళ్లింది. తెనాలి నిజాంపట్నం కాల్వ కట్టలో ఉన్న శిల్పశాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో సమాచారం ఇవ్వగా, వాహనం తొమ్మిదిన్నర ప్రాంతంలో రావడంతో నష్టం రూ.30 లక్షల వరకు జరిగింది. మరుసటి రోజు శిల్పశాలను సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, అగ్నిమాపక కార్యాలయానికి రెండో వాహన ఆవశ్యకత గురించి అధికారులు, సంబంధిత మంత్రితో మాట్లాడారు. అదే మే నెల 26వ తేదీన ఆటోనగర్‌లో వార్నిష్ తయారీ కేంద్రం గోడౌన్‌లో అతి అగ్నిప్రమాదం సంభవించింది. కేవలం ఒక శకటమే రెండు సార్లు నీటి కోసం తిరగాల్సి వచ్చింది. అప్పుడూ రెండో వాహనం ఉండాల్సిన ఆవశ్యకత మరోమారు చర్చకు వచ్చింది. మంత్రి ఒత్తిడితో అధికారులు ఎట్టకేలకు పాత వాహనాన్ని పంపారు. అయితే పాత వాహనం కేటాయించిన అధికారులు సరికొత్త హంగులతో కూడిన రూ.70లక్షల విలువైన ప్రత్యేక అగ్నిమాపక శకటాన్ని ఇక్కడికి పంపిన రెండు రోజులకే వెనక్కి పిలిపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరతతో రెండో వాహనాన్ని వినియోగించలేని దుస్థితి నెలకొంది. తగినంత మంది సిబ్బందిని అగ్నిమాపక కార్యాలయానికి కేటాయించాలని, సిబ్బంది వచ్చేవరకు పాత వాహనం స్థానంలో కొత్త వాహనం ఇక్కడే ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement


