మద్యం కంపెనీ రిప్రజెంటేటివ్ చేతివాటం వ్యాపారుల నుంచి వసూలు చేసిన రూ.1.5 కోట్లతో పరారీ నరసరావుపేట మద్యం డిపో కేంద్రంగా వెలుగు చూసిన మోసం డిపో అధికారులకు ఫిర్యాదు చేసిన మద్యం వ్యాపారులు
నరసరావుపేట టౌన్: మద్యం ఇండెంట్‌ల వ్యవహారంలో భారీ మోసం వెలుగు చూసింది. మద్యం కంపెనీ ప్రతినిధిగా చెలామణి అవుతున్న యువకుడు వ్యాపారుల నుంచి వసూలు చేసిన రూ.1.5 కోట్లతో పరారీ అయిన ఘటన పల్నాడు జిల్లాలో సంచలనం కలిగించింది. వివరాలు.. ప్రముఖ మద్యం కంపెనీ తరుఫున రిప్రజెంటేటివ్‌గా గురజాలకు చెందిన యువకుడు పనిచేస్తున్నాడు. దీంతో పాటు మద్యం కంపెనీ తరుపున నరసరావుపేట మద్యం డిపోలో అందుబాటులో ఉంటూ మద్యం సిండికేట్లకు డిపో నుంచి దుకాణాలకు కావాల్సిన మద్యం సరఫరా ఇండెంట్ వ్యవహారాలు చక్కదిద్దేవాడు. వ్యాపారులతో సన్నిహిత సంబందాలు ఏర్పాటు చేసుకున్నాడు. అతను చేసే సేవలకు గాను ప్రతి దుకాణం నుంచి నెలకు రూ.1500 జీతం తీసుకునేవాడు. గురజాల, మాచర్ల నియోజకవర్గాలలోని మద్యం దుకాణాలకు రోజూ వారి మద్యం సరఫరా ఇండెంట్‌ల లావాదేవీలు చూస్తుంటాడు. కొన్ని నెలలుగా మద్యం ఇండెంట్ కోసం వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బుల్లో సగం మాత్రమే బ్యాంక్‌లో జమ చేశాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న వ్యాపారులు రెండు రోజుల క్రితం యువకుడిని నిలదీశారు. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శనివారం గురజాల, మాచర్ల, వినుకొండలకు చెందిన వ్యాపారులు మద్యం డిపో వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న అధికారులను కలిసి తమకు జరిగిన మోసాన్ని వివరించారు. అయితే డిపోకు సదరు ప్రైవేటు ఉద్యోగికి ఎటువంటి అధికారిక సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.


